ఏపీ మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగింది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు సీబీఐ బృందాలు విచారణ చేపట్టాయి. పులివెందుల అతిథి గృహంలో సీబీఐ విచారణకు నలుగురు అనుమానితులు హాజరయ్యారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు కాగా ప్రకాష్ రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.
వీరితో పాటు.. ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న బాబురెడ్డి దంపతులనూ పలు వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మరో సీబీఐ బృందం ఇద్దరు అనుమానితులను విచారించారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్‌తో పాటు అతని సమీప బంధువు భరత్‌కుమార్ యాదవ్‌ను ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత.. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేకా ఇంటి వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
ఈనెల 10న పులివెందుల వివేకా ఇంటి వద్ద మణికంఠరెడ్డి రెండుసార్లు బైక్‌పై వచ్చి కాంపౌండ్ లోపల కూడా తిరిగినట్లు సునీత... ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇవాళ మణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఆ ప్రాంతంలో సంచరించాల్సి వచ్చింది, ఎవరు సూచనల మేరకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపైన మణికంఠ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం... మణికంఠ రెడ్డిపై బైండోవర్ కేసు నమోదైంది. జమ్మలమడుగు ఆర్డీవో వద్ద పోలీసులు బైండోవర్ చేయించారు.