Group-D Buildings Lease: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల కోసం రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ కాసుల వేట ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజధానిలో గ్రూప్-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ చేసిన ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇటీవల జరిగిన పురపాలక శాఖ, సీఆర్డీఏ సమీక్షలో అధికారులు చేసిన ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. విట్ యూనివర్సిటీకి ఇందులో ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
దీని ద్వారా ఏడాదికి రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు లీజు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ వర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఒక టవర్‌లోని 120 ఫ్లాట్‌లను లీజుకు ఇచ్చి ఆదాయం ఆర్జించాలని సీఆర్డీఏ భావిస్తోంది. తదుపరి ఐదు టవర్లను కూడా లీజుకు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. గ్రూప్-డి ఉద్యోగుల కోసం గతంలో 6 రెసిడెన్షియల్ టవర్లను ప్రభుత్వం నిర్మించింది. 2019 నాటికే 7.7 ఎకరాల విస్తీర్ణంలో 720 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది. 65 శాతం మేర పనులు కూడా పూర్తయ్యాయి. 10,22,149 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియా కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తం ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల్లో ఒక దానిని లీజుకు తీసుకునేందుకు విట్ యూనివర్సిటీ కూడా ముందుకు వచ్చింది. ఈ భవనాలను లీజుకిచ్చేందుకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.