ధరణి పోర్టల్(Dharani portal)కు ముందు భూముల రిజిస్ట్రేషన్(registration), మ్యుటేషన్(mutation) పెద్ద తంతుగా ఉండేది. ఒకచోట రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, తహసీల్దారు కార్యాలయంలో మ్యుటేషన్ పూర్తిచేసుకోవాల్సి వచ్చేది. అప్పుడుగానీ పాసుపుస్తకం అందేది కాదు. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూ యజమానులు కొందరు పాసుపుస్తకాలు(Passbooks) అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీనికోసం ఎవరిని అడగాలనే దానిపైనా స్పష్టత లేదంటున్నారు. పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిచేయడం వరకే తహసీల్దారు- సంయుక్త సబ్‌రిజిస్ట్రారు విధిగా ఉంది. ప్రక్రియ పూర్తికాగానే హక్కులకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రతులను తహసీల్దారు కార్యాలయంలో భూ యజమానులకు అప్పగిస్తున్నారు. పాసుపుస్తకం అందించడమనేది వారి పరిధిలో లేదు.
ట్రాకింగ్ వ్యవస్థ లేక...
ప్రభుత్వం చెన్నైలో ముద్రణ సంస్థ నుంచి నేరుగా తపాలాశాఖ ద్వారా యజమానులకు పాసుపుస్తకాలు పంపిస్తోంది. అవి రావడానికి నెల వరకూ సమయం పడుతోంది. చెన్నై నుంచి పంపిన ఆయా పుస్తకాలు రవాణాలో ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసుకునే ట్రాకింగ్ వ్యవస్థ లేకపోవటం, పుస్తకాలను పంపిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులకు ముందస్తు సమాచారం అందించకపోవటం ప్రక్రియలో లోపంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో భూమి ఉండి పట్టణాలు, నగరాల్లో నివసిస్తుండేవారికి పుస్తకాలు అందడం కష్టసాధ్యమవుతోంది. గ్రామాల్లో బంధువులు, స్నేహితులు ఉన్నవారు పుస్తకాలు రాగానే యజమానులకు కబురు పెడుతున్నారు. గ్రామంతో సంబంధం లేని వారికి కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే పుస్తకాలు చాలామందికి చేరడం లేదని చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ తదితర జిల్లాలకు చెందిన కొందరు భూ యజమానులకు ఇప్పటికీ పుస్తకాలు అందలేదని చెబుతున్నారు. మరోవైపు కొందరు ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి రైతులు తాము నివసిస్తున్న చిరునామా సమర్పిస్తే ఉన్నతాధికారులు అక్కడికి పుస్తకాలను తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘చాలా వరకు యజమానులకు సులువుగా పుస్తకాలు అందుతున్నాయి. చిరునామా సమస్యలతో అవి అందని వారు మా దృష్టికి తెస్తుంటే వెంటనే పరిష్కరిస్తున్నాం’’.. అంటూ సీసీఎల్‌ఏకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఇదీ చూడండి: