ఒకే నంబరుతో రెండు బస్సులు తిరుగుతున్నాయి. అవి కూడా ఏ ప్రైవేటు సంస్థకు చెందినవో కావు. ఆర్టీసీ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న బస్సులు. TS-08-Z-0208 నంబరుతో గరుడ ప్లస్, ఎక్స్‌ప్రెస్ బస్సులు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో గరుడ ప్లస్ ఆర్టీసీది కాగా... ఎక్స్‌ప్రెస్ బస్సు మాత్రం ఆర్టీసీకి చెందినది కాదని తెలుస్తోంది.
ఈ- చలాన్లతో విషయం వెలుగులోకి..
రోడ్డు రవాణ సంస్థ బస్సులను కొన్ని లక్షల కిలోమీటర్లు తిప్పిన తర్వాత వాటిని ప్రైవేట్ వారికి అమ్మేస్తారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల వారికి విక్రయిస్తారు. అలా కొనుగోలు చేసిన వారెవరైనా ఈ విధంగా నడుపుతున్నారేమోనని ఆర్టీసీ యాజమాన్యం అనుమానం వ్యక్తంచేస్తోంది. TS-08-Z-0208 నంబరుతో రెండు బస్సులు తిరుగుతున్నాయని 15 రోజుల క్రితం హైదరాబాద్ -1 డిపో మేనేజర్... శంషాబాద్, అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. ఐతే... ఈ విషయాలు ఇటీవల ఈ-చలాన్లతో బయటకు వచ్చాయి.