ఇటీవలి ఓ వ్యక్తి కరోనా బారినపడి 28 రోజులపాటు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆసుపత్రి రూ.23 లక్షల బిల్లు వేసింది. ఇందులో పర్సన్ ప్రొటెక్షన్ కిట్లు(పీపీఈ) 28 వాడినట్లు పేర్కొని, వాటి కింద రూ.1.40 లక్షలు చూపింది. ఒక్కో కిట్‌కు గరిష్టంగా రూ.2 వేలు వేసుకున్నా మొత్తం రూ.56 వేలు దాటరాదు. అదనంగా మూడు రెట్లు వసూలు చేయడం గమనార్హం. వాస్తవానికి కరోనా తొలి నాళ్లలో పీపీఈ కిట్లకు కొరత ఉండేది. ఎక్కువ ధరకు విక్రయించేవారు. ప్రస్తుతం హోల్‌సేల్‌గా కొంటే రూ.300-700 పడుతోంది. ఈ ఆసుపత్రి ఒక్కో కిట్‌కు రూ.5 వేలు వసూలు చేయడం చూస్తే దోపిదీ ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
రెండో విడతలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు దవాఖానాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోగులను పిండేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా కొన్ని రకాల ఛార్జీలు మరీ ఎక్కువగా ఉండటంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపీఈ కిట్ల ఛార్జీలే ఇందుకు ఉదాహరణ.
ఒకే కిట్... అందరికి ఛార్జీలు
ఒక వార్డులో 10-15 మంది కరోనా రోగులు ఉంటారు. ఉదయం, మధ్యాహ్న సమయంలో వైద్యులు ప్రతి రోగిని పరిశీలిస్తారు. ఒక్కో రోగి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని చికిత్సలను నర్సులకు సూచిస్తున్నారు. ఒకసారి పీపీఈ కిట్‌తో లోపలకు వెళితే...రోగులందర్ని పరిశీలించాకే బయటకు వస్తారు. ఒక వైద్యుడికి ఉదయం, సాయంత్రం రెండు పీపీఈ కిట్లు అవసరం అవుతాయి. నర్సులకు ఇతర సిబ్బందికి అదే పరిస్థితి. వాస్తవానికి ఈ ఛార్జీలను సమానంగా విభజించి పది మంది రోగుల ఖాతాలో చేర్చాలి. అయితే ఇక్కడ జరుగుతున్నది వేరే...ప్రతి రోగి ఖాతాల్లో రోజుకు రెండు లేదా మూడు కిట్లు వాడినట్లు బిల్లులు వేస్తున్నారు. చాలా ఆసుపత్రుల్లో ఇదే తంతు నడుస్తోంది. ఇలా రోగులు డిశ్ఛార్జి అయ్యే నాటికి వీటి ఛార్జీలే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటున్నాయి.
బీమా వర్తించక పోవడంతో..
ఈ సమయంలో చాలా కుటుంబాలను ఆరోగ్య బీమా ఆదుకుంటోంది. కొన్ని సంస్థల బీమాలో పీపీఈ కిట్లు ఇతర అదనపు ఛార్జీలు వర్తించవు. ఇవి రోగి సొంతగానే చెల్లించాలి. కేవలం గదుల అద్దె, ఔషధాలే చెల్లిస్తున్నాయి. డైట్, పీపీఈ కిట్లు ఇతర బీమాలోకి రాని వాటితో రోగులపై భారీగా బాదేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. బీమా పోను...కొద్ది మొత్తమే చెల్లిస్తే సరిపోతుందని ముందు చెప్పి..తర్వాత చేతిలో పెద్ద బిల్లులు పెడుతున్నాయి. కొన్నిసార్లు బీమా క్లైం కంటే ఈ అదనపు ఛార్జీలే ఎక్కువగా ఉంటున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందింది అడ్డగోలు ఛార్జీలకు అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు.