Presidential Police medals: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ఏటా ఇచ్చే పురస్కారాలను ఆదివారం ప్రకటించారు. తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 17 పోలీసు పతకాలు (పీఎం) లభించాయి. పోలీసుశాఖలో విశేష సేవలందించినందుకు రాచకొండ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ సెల్) ఎస్పీ దేవేందర్‌సింగ్ రాష్ట్రపతి పతకాలకు ఎంపికయ్యారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేశ్ భగవత్‌కు ఇది మూడో అత్యుత్తమ పురస్కారం కావడం విశేషం. 2004లో ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్యపతకం, 2011లో ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. గతంలో ఆయన పలు అంతర్జాతీయ పతకాలను సాధించారు. 2004లో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘పోలీస్ మీకోసం’ ప్రాజెక్టు చేపట్టినందుకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డు సొంతమైంది. ఉమ్మడి నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు 2006లో ‘ప్రాజెక్టు ఆసరా’ నిర్వహించినందుకు ‘వెబర్ సావీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ సివిల్ రైట్స్ అవార్డు’ మహేశ్ భగవత్‌కు దక్కింది. 2017లో ‘ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ రిపోర్ట్ హీరో’ అవార్డు.. అదే ఏడాది ‘టాప్ 100 హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ స్లేవరీ ఇన్‌ఫ్లుయన్స్ లీడర్స్’ అవార్డు.. 2018లో ‘ఐఏసీపీ లీడర్‌షిప్ ఇన్ హ్యూమన్ అండ్ సివిల్‌రైట్స్ ఇండివిడ్యువల్’ అవార్డులు ఆయనకు లభించాయి. 1500 మంది వరకు సివిల్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో మెలకువలను నేర్పించారు.
సాంకేతిక సేవలకు పట్టం...1992లో ఎస్సైగా పోలీస్‌శాఖలో చేరిన దేవేందర్‌సింగ్ ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం(సీఐసెల్)లో నాన్‌కేడర్ ఎస్పీగా పనిచేస్తున్నారు. 1997 దాకా హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేసిన అనంతరం 2003దాకా బేగంపేట విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారిగా పనిచేశారు. యూఎన్ పీస్ మిషన్‌లో భాగంగా తైమూర్ లెస్టే, సౌత్ సుడాన్‌లలో రెండేళ్లపాటు పనిచేశారు. ఐ సెల్‌లో పనిచేస్తూ సిమి, జేఈఎం, లష్కరేతోయిబా, పీఎఫ్‌ఐ, ఐసిస్ మాడ్యూళ్ల కుట్రల్ని భగ్నం చేశారు. సైబర్‌నేరాల కట్టడి కోసం టీ4సీ ఏర్పాటు, సీడాట్, సైక్యాప్స్, డోపమ్స్, దర్పణ్, సత్యపాన్ అండ్ ఐవెరిఫై, నిఘాయాప్స్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.