మాతృభాష పునాదులపైనే పిల్లలు ఇతర భాషలతో పాటు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలరని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, కేంద్ర విద్యాశాఖలు సంయుక్తంగా దిల్లీలో నిర్వహించిన విశ్వ పుస్తక మేళా సందర్భంగా మార్చి 9న ‘నూతన విద్యా విధానం- మాతృభాషల స్థానం’ అన్న అంశంపై వర్చువల్ విధానంలో జరిగిన చర్చలో ఎస్‌సీఈఆర్‌టీ మాజీ ఆచార్యుడు, విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ తెలుగు పుస్తకాల సమన్వయకర్త సువర్ణ వినాయక్‌లు పాల్గొని మాట్లాడారు.
కొత్త విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం
కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. గతంలోని విద్యా విధానాలన్నీ మాతృభాషను స్పృషించి వదిలివేయగా...తాజా విద్యా విధానం దాన్ని తప్పనిసరి చేసిందని అన్నారు.
2009 విద్యా హక్కు చట్టం ద్వారా మాతృభాషకు చట్టబద్ధత లభించగా రెండు దశాబ్దాల తర్వాత మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యా విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని వినాయక్ అన్నారు. అయిదో తరగతి వరకు అమ్మభాషలోనే విద్యా బోధన కొనసాగించాలని, ఇంకా 8వ తరగతి వరకు కూడా చేయాలని చెప్పడం మంచి పరిణామమన్నారు. పదో తరగతి వరకు ఏదో ఒక సాహిత్యాంశంలో పట్టు సాధించాలనడం ద్వారా కొత్త విద్యా విధానంలో మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఆచార్య ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంగ్ల మాధ్యమం బడుల్లో చదవడం, రాయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పైగా బట్టీ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.