ఏపీలోని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తురకపాలెంలో.. 5వేల జనాభా ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీలో దశాబ్దాలుగా.. ఓ అనధికారిక ఒప్పందం అమలవుతోంది. ఓటర్ల బదులు ఆయా పార్టీల బూత్ ఏజెంట్లే ఓటు వేయడం అలవాటుగా వస్తోంది. ఇప్పటివరకూ పలుమార్లు ఎన్నికలు జరిగినా చాలా మందికి అసలు సొంతంగా ఓటేసిన అనుభవమే లేకుండా పోయింది. అయితే ఈనెల 13న పూర్తైన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో.. యథావిధిగా ఏజెంట్లే తమ ఓటు వేస్తారని గ్రామస్థులు చెప్పగా అధికారులు అవాక్కయ్యారు. స్థానిక ఎస్సై, ఎన్నికల అధికారులు కలిసి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఎవరి ఓటు వారు వేసేలా నచ్చజెప్పారు. ఫలితంగా.. తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. 93.83 శాతం ఓటింగ్ నమోదైంది.
దశాబ్దాల తర్వాత ఆ ఊరోళ్లు ఓటేశారు! - తురకపాలెం పంచాయతీ ఎన్నికలు అప్డేట్
ఆ ఊరిలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులూ ఎన్నికయ్యారు. కానీ ఏనాడూ గ్రామస్థులు సొంతంగా ఓటేసుకొనే భాగ్యానికి నోచుకోలేదు. కారణం.. ఓ అనధికారిక ఒప్పందం. ఈసారి అధికారులు ఆ దుస్సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఎట్టకేలకు ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
తొలినాళ్లలో నిరక్షరాస్యులు, వృద్ధులు పోలింగ్ కేంద్రంలో ఇబ్బందులు పడటం సహా.. ఓట్లు చెల్లకుండా పోతున్నాయన్న కారణంతో... ఏజెంట్లే వారి తరఫున ఓటేయడం మొదలుపెట్టారు. ఓటింగ్ సజావుగా సాగితే చాలనే ఉద్దేశంతో గ్రామస్థులూ అదే పద్ధతికి ఆమోదం తెలిపారు. కాలక్రమంలో అదో సంప్రదాయంలా మారగా..ఇన్నాళ్లకు పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారుల చొరవతో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామస్థులు ఇకమీదటా ఇలానే జరగాలని ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి:అడవుల్లో పులుల ఆధిపత్య పోరు.. ఎందుకో తెలుసా?