Uma Maheshwari Passed away: కంఠమనేని ఉమామహేశ్వరి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మధ్యాహ్నం మరోసారి వచ్చారు. తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి.. ఉమామహేశ్వరి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర తదితరులు నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనధికారిక సమాచారం. ఉమామహేశ్వరి మరణంపై కుమార్తె దీక్షిత పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు డయల్ 100కి ఫోన్ చేసినట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన జూబ్లీహిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2.45 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.