తెలంగాణ

telangana

ETV Bharat / city

Traffic Diversions: తెరాస ప్లీనరీ సందర్భంగా నగరంలో పటిష్ట భద్రత.. పలు చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు, అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల్లో అధిక సంఖ్యలో ప్లీనరీకి కార్యకర్తలు హాజరు కానుండటంతో జేఎన్‌టీయూ, మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్స్‌ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

police high security in hyderabad for trs plenary 2021 today
police high security in hyderabad for trs plenary 2021 today

By

Published : Oct 25, 2021, 5:34 AM IST

తెరాస ప్లీనరీని పురస్కరించుకుని హైదరాబాద్​లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ జరిగే హైటెక్స్‌తో పాటు మాదాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో సుమారు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. 750 మంది ట్రాఫిక్‌ పోలీసులు, శాంతిభద్రతల విభాగంకు చెందిన 1100 మంది సిబ్బంది, ఆక్టోపస్‌, ఆరుగురు డీసీపీలు, 23 మంది ఏసీపీలు, 48 మంది సీఐలు, 201 మంది ఎస్‌ఐలతో పాటు ఏఆర్‌ విభాగానికి చెందిన 90 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. ఇప్పటికే పోలీసులు ప్లీనరీ జరిగే హైటెక్స్‌ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పర్యవేక్షిస్తున్నారు.

ట్రాఫిక్​ ఆంక్షలు..

ప్లీనరీకి వాహనాల్లో హాజరయ్యే నేతలు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు హైటెక్స్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. నీరూస్‌, సైబర్ టవర్స్‌ కూడళ్లతో పాటు ఖానామెట్‌, హైటెక్స్‌, హెచ్‌ఐసీసీ, న్యాక్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. జేఎన్టీయూ, బయోడైవర్సిటీ చౌరస్తాలతో పాటు కొత్తగూడ, కొండాపూర్‌, గచ్చిబౌలి కూడళ్లలో వాహనాలను పోలీసులు మళ్లించనున్నారు. ఆంక్షలు ప్లీనరీ పూర్తయ్యే వరకు కొనసాగనున్నాయి. వాహనదారులు పోలీసులు విధించిన ఆంక్షలు పాటించి సహకరించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.

పార్కింగ్​ కోసం ఏర్పాట్లు..

వాహనాల పార్కింగ్‌ కోసం సభ చుట్టూ ఎనిమిది పార్కింగ్ కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు హైటెక్స్ పార్కింగ్ ప్రాంగణాన్ని కేటాయించారు. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వాహన శ్రేణి కోసం.. ప్రత్యేకంగా ప్లీనరీ సభ వెనుక ఉన్న గేటు నుంచి సభ ప్రాంగణంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్కింగ్​ ఎక్కడెక్కడంటే...

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మండల కేంద్రాల నుంచి వచ్చే తెరాస ప్రజా ప్రతినిధులకు ఎటువంటి అంటాకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైటెక్స్ ప్రాంగణం సమీపంలో ఐదు చోట్ల పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు వేల వాహనాలు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్​ నుంచి వచ్చే వాహనాల కోసం జయభేరి క్లబ్ వెళ్లే దారిలో ఇరువైపులా దాదాపు నలభై ఎకరాల స్థలం కేటాయించారు. పటాన్​చెరు, కూకట్​పల్లి, మియాపుర్ నుంచి వచ్చే వాహనాలను కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వెనుక వరల్డ్ వన్ స్కూల్ ప్రాంగణంలో, నూతనంగా ఏర్పాటు చేసిన లింకు రోడ్డులో, నోవాటెల్ హోటల్ ప్రహరీ గోడ సమీపంలో, వసంత సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details