తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొండలెక్కిన పోలవరం నిర్వాసితులు.. దిక్కూమొక్కూలేని తొలిదశ ప్రణాళికలు' - AP floods latest news

Flood effect on Polavaram oustees : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ ఊరిని, ఇంటిని, భూములను ధారబోసినవారు ఇప్పుడు బతుకుజీవుడా అంటూ నానా పాట్లు పడుతున్నారు. ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే గ్రామాలను ఏటా వరద ముంచెత్తుతోంది. తొలిదశ పునరావాసం కూడా మూడేళ్లుగా నత్తనడక సాగుతోంది. పూర్తి పునరావాసం ఏర్పాటు చేయకపోవడంతో ఆ కుటుంబాల వారు తమ ఊళ్లు ఖాళీ చేయలేకపోతున్నారు. దాంతో వానలు వచ్చినప్పుడు కొండలెక్కి బతుకు జీవుడా అంటూ ఊపిరి తీసుకోవాల్సి వస్తోంది.

Flood effect on Polavaram oustees
Flood effect on Polavaram oustees

By

Published : Jul 12, 2022, 1:27 PM IST

Flood effect on Polavaram oustees : గోదావరికి వరద రోజురోజుకు ఉద్ధృతం అవుతుండటంతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు హాహాకారాలు చేస్తున్నారు. ప్రాజెక్టు వల్ల ముంపులో చిక్కుకునే గ్రామాలను ఏటా వరద ముంచెత్తుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి తమ ఊరిని, ఇంటిని, భూములను ధారబోసినవారు ఇప్పుడు బతుకుజీవుడా అంటూ నానా పాట్లు పడుతున్నారు. తొలిదశ పునరావాసం కూడా మూడేళ్లుగా నత్తనడక సాగుతోంది. నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాసం కల్పించలేకపోయారు. మూడేళ్లుగా వాళ్లు గోదావరి వరదల్లో చిక్కుకుని తాత్కాలికంగా ఎక్కడో అక్కడ పునరావాసం ఏర్పాటు చేసుకుంటూ పడుతున్న అవస్థలు ఇన్నీ, అన్నీ కావు. అనేక గిరిజన గ్రామాల ప్రజలు వారి ఊరి సమీపంలో ఉన్న కొండలెక్కి బతుకు జీవుడా అని వరద రోజుల్లో ఊపిరి తీసుకోవాల్సి వస్తోంది. పూర్తి పునరావాసం ఏర్పాటు చేయకపోవడంతో ఆ కుటుంబాల వారు తమ ఊళ్లు ఖాళీ చేయలేకపోతున్నారు.

చుట్టూ వరద.. కొండల మీదే జీవనం..ఏలేరుపాడు, దేవీపట్నం, వర రామచంద్రపురం మండలాల్లోని అనేక గ్రామాల గిరిజనులు కొండలెక్కి శిబిరాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. చుట్టూ వరద.. బయటి ప్రపంచానికి దారులు మూసుకుపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలాన్ని ఇప్పటికే వరద ముంచెత్తింది. ఈ మండలంలోని కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు గిరిజనులు అక్కడే కొండలెక్కి తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. దేవీపట్నం పూర్తిగా మునిగిపోయింది. ఆ గ్రామ నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు.

గత ఏడాది నుంచి కొందరు గోకవరం తదితర గ్రామాల్లో అద్దెకు ఇళ్లు తీసుకుని జీవనం వెళ్లదీస్తున్నారు. పూడిపల్లి నిర్వాసితుల సమస్య ఇలాంటిదే. వర రామచంద్రపురం మండలంలో తొలిదశలో 41.15 మీటర్ల స్థాయికి నీటిని నిలబెడితే ముంపులో చిక్కుకునే గ్రామాలు 20. వారికీ పునరావాసం ఏర్పాటు చేయలేదు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి వద్ద పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కొంత మేర పూర్తయినా వసతులు కల్పించలేదు. ఇంకా ఇతరత్రా అనేకచోట్ల పునరావాస కాలనీల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. వర రామచంద్రపురం మండలంలోని కల్తునూరు, పోతవరం, తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు గ్రామాల గిరిజనులు కూడా సమీపంలో కొండలెక్కి తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించాల్సి వస్తోంది. వేలేరుపాడు మండలంలోని కొన్ని గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది.

పోలవరం ప్రాజెక్టు వద్ద తొలిదశ పునరావాసం పూర్తి చేయకముందే ఎగువ కాఫర్‌ డ్యాంను 42 మీటర్ల ఎత్తులో నిర్మించారు. దాదాపు 32 టీఎంసీల వరకు పోలవరం నీళ్లు వెనక్కు నిల్వ ఉండిపోతున్నాయి. వరద, కాఫర్‌ డ్యాం అడ్డుకట్టతో తొలిదశ ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

88 ఆవాసాలు ఖాళీ చేయనేలేదు..అధికారుల లెక్క ప్రకారం ఈ ప్రాజెక్టు తొలిదశలో 5 మండలాల్లోని 54 గ్రామాలకు చెందిన 115 ఆవాసాల్లో ఉన్న గిరిజన, గిరిజనేతర ప్రజలు ప్రభావితమవుతారు. ఇంకా సుమారు 80 ఆవాసాలు తరలించాల్సి ఉంది. దాదాపు 12 వేల కుటుంబాలకు ఇంకా పునరావాసం కల్పించలేకపోయారు. తొలిదశలో నిర్వాసితుల కోసం 75 కాలనీలు నిర్మించాల్సి ఉంది. దాదాపు 50 కాలనీల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు.

ఎందుకీ ప్రణాళికలు..అధికారులు మూడేళ్లుగా చెబుతున్న ప్రణాళికలు ఏవీ అమలు కావడం లేదు. గత ఏడాది చెప్పిన ప్రణాళిక ప్రకారం.. 2021 ఆగస్టు నెలాఖరుకు తొలిదశ పునరావాసం పూర్తి కావాలి. కానీ కాలేదు. మళ్లీ వరద సీజన్‌ వచ్చింది. మే నెలలో 2,311 కుటుంబాలను, జూన్‌లో 823 కుటుంబాలను, జులైలో 1,010 కుటుంబాలను ఆగస్టులో 720 కుటుంబాలను తరలించాలని పునరావాస అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ ప్రణాళిక ప్రకారమైనా తరలింపు సాగుతోందా అంటే అదీ లేదు.

ABOUT THE AUTHOR

...view details