polavaram: పోలవరం ప్రాజెక్టులో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1,383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది. గతంలో విభాగాల వారీగా పరిమితులు పెట్టి, అంతకన్నా మించి ఖర్చు చేసిన రూ.831.93 కోట్ల పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించబోమని తేల్చి చెప్పింది. ఇప్పుడు వాటికి అదనంగా ఇతర కారణాలను చూపుతూ మరో రూ.551.37 కోట్ల బిల్లులను తిరస్కరించింది. స్పిల్‌వే, విద్యుత్కేంద్రం, ప్రధాన రాతి, మట్టి కట్టడాల నిర్మాణానికి అదనపు ధరల పేరుతో పెట్టిన బిల్లులను ఇవ్వబోమంది. ‘‘మేం 2013-14 ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నాం. అందువల్ల కొత్త ఒప్పందం ప్రకారం సమర్పిస్తున్న వాటిని చెల్లించబోం’ అంటూ అథారిటీ వాటిని వెనక్కి పంపింది.
*కొత్త ఒప్పందం ప్రకారం ఖర్చు చేసిన మొత్తంలో వివిధ పనుల కింద జలవనరుల శాఖ పంపిన బిల్లులను ఇటీవల పోలవరం అథారిటీ తిరస్కరించింది. ఈమేరకు రూ.324.84 కోట్ల బిల్లులను వెనక్కి పంపింది. వాటిలో ఒప్పందాన్ని దాటి ఉన్నాయని
రూ.137.47 కోట్లు, అదనపు ధరల రూపంలో ఉన్నాయని రూ.94.66 కోట్లు, తాజా ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయని డీ వాటరింగ్ (నీటిని ఎత్తిపోసినందుకు) పేరిట సమర్పించిన రూ.95.71 కోట్ల బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
*పోలవరం విద్యుత్ కేంద్రం నిర్మాణానికి డిసెంబరు వరకు చేసిన ఖర్చులకు సంబంధించిన రూ.133.97 కోట్ల బిల్లులను తిరస్కరించింది. విద్యుత్ కేంద్రం కోసం నిధులు ఇవ్వబోమని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ కేంద్రం నిధులు అడగబోవడం లేదు. అయితే అక్కడ జరిగే మట్టి తవ్వకం పనులకు నిధులు ఇవ్వాలని, అది విద్యుత్ కేంద్రం కాంపొనెంట్ కిందికి రాదని వాదిస్తోంది. ఇందుకు పోలవరం అథారిటీ ససేమిరా అంటోంది.
*కుడి కాలువలో తాత్కాలిక నిర్మాణాల కోసం చేసిన రూ.71.37 కోట్ల ఖర్చును ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదు. అవి పట్టిసీమ నీటిని వినియోగించుకునేందుకు తాత్కాలికంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన బిల్లులని తేల్చింది.
విభాగాల వారీగా ఖర్చులూ మీరలేం..
పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖలు 2013-14 ధరల ప్రకారం ఏ ఖర్చులు అయితే ఉన్నాయో అంత మొత్తమే ఇకపై చెల్లిస్తామని గతంలో పేర్కొన్నాయి. 2020 సెప్టెంబరు నాటికి మిగిలి ఉన్న రూ.7,053 కోట్ల మేర మాత్రమే పోలవరానికి నిధులు ఇవ్వగలమన్నాయి. అప్పటి నుంచి పోలవరానికి సవరించిన అంచనాల మేరకు 2017-18 ధరల ప్రకారం కేంద్రం పెట్టుబడి అనుమతులు ఇవ్వలేదు. పోలవరం అథారిటీ కొర్రీలపై కొర్రీలు వేస్తూనే ఉంది. దీంతో అందులో వివిధ కాంపొనెంట్ల కింద పాత ధరల కింద ఎంత ఆమోదం పొందిందో అంతకుమించి నిధులు ఇచ్చేది లేదని అథారిటీ చెబుతోంది. ఆయా పరిమితుల మేరకు ఇప్పటికే రూ.831 కోట్లను తిరస్కరించింది.