పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ధరలు, పరిమాణాల ప్రకారం రూ. 20 వేల 398 కోట్లకు సవరించిన అంచనాలను ఆమోదించి పంపాలని కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవలే ఆర్థిక శాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థిక శాఖ షరతులే ఎజెండాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ నవంబర్ 2న హైదరాబాద్ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశం కానుంది. అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయ్యర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్ గుప్తా పాల్గొంటారు. తమవాదనను గట్టిగా వినిపించేందుకు ఏపీ జలవనరుల శాఖ ప్రెజెంటేషన్‌తో సిద్ధమవుతోంది. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కేంద్రం తరఫున పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో ఏపీ ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తోందని.. అధికారులు స్పష్టం చేయనున్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి 2017- 18 ధరల ప్రకారం ఎంత వ్యయం అవుతుందో మదింపు చేసి, ఆమోదించి కేంద్ర జలసంఘానికి సిఫారసు చేసిన అథారిటీయే ఇప్పుడు అందుకు భిన్నంగా రూ. 20 వేల 398 కోట్లకు ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించనున్నారు. తొలి అంచనాను కేంద్ర జలసంఘం కూడా మదింపు చేసి 2017-18 ధరలకు అనుగుణంగా అంచనా వ్యయం రూ. 55 వేల కోట్లు కావాలని సాంకేతిక సలహా కమిటీ ఎదుట స్వయంగా ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయనున్నారు. సాంకేతిక సలహా కమిటీ సైతం ఆ మొత్తాన్ని ఆమోదించిందని, రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా మదింపు చేసి ఆమోదించిన తర్వాత తుది అంచనాలను ఎలా తగ్గిస్తారని ప్రశ్నించబోతున్నారు.