తెలంగాణ

telangana

ETV Bharat / city

పైపైకి ఇంధన ధరలు.. సామాన్యుడి గుండె గుబేలు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలు, వ్యాట్‌లు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. లాక్​డౌన్​తో ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అంతకంతకూ ధరలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

petrol and diesel prices raises rapidly from days all over country
పైపైకి ఇంధన ధరలు.. సామాన్యుడి గుండె గుబేలు

By

Published : Jun 23, 2020, 6:53 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా.. దేశంలో మాత్రం ఆ మేరకు ఇంధన ధరలు తగ్గడం లేదు. 16 రోజుల నుంచి పైపైకి ఎకబాకుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలల్లో దాదాపు ఎనిమిది శాతం పెట్రోల్‌ ధరలు, దాదాపు తొమ్మిది శాతం డీజిల్‌ ధరలు పతనమయ్యాయి. ఏప్రిల్‌ నెలలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.73.97 ఉండగా.. డీజిల్‌ ధర లీటరుకు రూ.67.82గా ఉండేది. మే 6 వరకు అలానే స్థిరంగా కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధర పతనమవుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 14న.. పెట్రోల్‌, డీజిల్‌లపై మూడు రూపాయలు చొప్పున ప్రత్యేక ఎక్సైజ్‌ డ్యూటీ విధించింది. అదే విధంగా మే 5న తిరిగి పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 చొప్పున ప్రత్యేక ఎక్సైజ్‌ డ్యూటీని విధించింది. ఇలా రెండు సార్లు పెంచడం ద్వారా రెండు లక్షల కోట్లు ఆదాయం కేంద్రానికి సమకూరుతుందని ఆర్థిక నిపుణుల అంచనా.

ఈ నెల 7న నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్​లో 16 రోజులు పెరిగిన ధరలను.. ఈ నెల 6 నాటి ధరలతో పోలిస్తే పెట్రోల్‌పై రూ.8.62, డీజిల్‌పై రూ.9.24 పెరిగింది. అంటే పెట్రోల్‌పై 10.44 శాతం, డీజిల్‌పై 11.99 శాతం పెరిగాయి. సోమవారం నాడు నగరంలో లీటరు పెట్రోలు రూ.82.59, డీజిల్‌ లీటరు రూ.77.06లకు ధరలు ఎగబాకాయి.

అంతర్జాతీయ విపణిలో సోమవారం ముడిచమురు బ్యారెల్‌ ధర 42.24 డాలర్లుగా ఉంది. అంటే డాలరు రూ.75.74 చొప్పున ఉంది. భారత కరెన్సీలో 159 లీటర్లు సామర్థ్యం కలిగిన బ్యారెల్‌ ముడిచమురు ధర రూ.3,199గా ఉంది. అంటే లీటరు ముడిచమురు ధర కేవలం రూ. 20.12లు. రీఫైనరీ ప్రాసెసింగ్‌ చేయడానికి, ఫ్రైట్‌ ఖర్చులు, రీఫైనరీ మార్జిన్‌ అన్ని కలిపి పెట్రోల్‌ పంపులకు చేరేసరికి మరో రూ.4.50 లీటరు పెట్రోల్‌కు, రూ.5.92 లీటరు డీజిల్‌కు అదనంగా వస్తుంది. పెట్రోల్‌ పంపునకు చేరేప్పటికి లీటరు పెట్రోల్‌ ధర రూ.24.62, లీటరు డీజిల్‌ ధర రూ.26.04 ఉండాలి.

పెట్రోల్‌ పంపుల డీలర్లకు లీటరు పెట్రోల్‌పై కమీషన్‌ కింద రూ.3.60 చెల్లిస్తోంది. ఇటీవల పెంచిన ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకంతో కలిపి లీటరు పెట్రోల్‌పై రూ.32.98లను కేంద్రం విధిస్తోంది. అదే విధంగా లీటరు డీజిల్‌పై కమీషన్‌ కింద రూ.2.53, ఇటీవల పెంచిన ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకంతో కలిపి లీటరు డీజిల్‌పై రూ.31.83లను కేంద్రం విధిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ సుంకం అనంతరం పెట్రోల్‌ లీటరు రూ.61.20, డీజిల్‌ లీటరు రూ.60.40గా ఉంది. ఈ మొత్తాలపై ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న విలువ ఆధారిత పన్ను-వ్యాట్‌ను విధిస్తాయి.

రాష్ట్రంలో..

రాష్ట్రంలో తీసుకుంటే ఆ మొత్తాలపై లీటరు పెట్రోల్​పై 35.20 శాతం.. లీటరు డీజిల్​పై 27 శాతం వ్యాట్‌ విధిస్తోంది. దీనికి తోడు చమురు సంస్థలు గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 16 రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా పెంచుతూ పోతున్నాయి. ఫలితంగా ఇంధన ధరలు పైపైకి ఎకబాకుతున్నాయి. అంతిమంగా రవాణా వ్యయం పెరిగి.. ఆ ప్రభావం నిత్యవసర సరకులపై పడుతోంది.

వాస్తవానికి..

వాస్తవానికి అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరల ఆధారంగా... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు హెచ్చుతగ్గులు ఉండాలి. ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అసలై లాక్​డౌన్​తో సతమతమవుతున్న సామాన్యులకు.. గుట్టు చప్పుడు కాకుండా చమురు సంస్థలు పెంచుతున్న ఇంధన ధరలు బెంబేలేత్తిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలు అదుపుచేయాలని వినియోగదారులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీచూడండి:కరోనా.. కాపాడేవారినే కాటేస్తోంది!

ABOUT THE AUTHOR

...view details