Penna River flood Drone Visuals: నెల్లూరు జిల్లాలో పెన్నానది సృష్టించిన వరద.. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ప్రజల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కోవూరు మండలం సాలుచింతల ప్రాంతంలో ఆదివారం చిత్రీకరించిన దృశ్యాలివి..! ఉహించనిస్థాయిలో వచ్చిన వరద అనేక గ్రామాలను చుట్టుముట్టింది. ఉద్ధృతిని తగ్గించేందుకు అధికారులు పెన్నా పొర్లుకట్టకు గండి కొట్టి.. తిరిగి పెన్నానదిలో వరద కలిసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే జనం తీవ్రంగా నష్టపోయారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల(Nellore rain news latest) వల్ల వాగులు పొంగుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీలు జలమయమయ్యాయి. నెల్లూరు భగత్‌సింగ్‌కాలనీ జలదిగ్బంధంలో ఉండగా.. వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్లు నీటమునిగాయి. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో.. పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. జిల్లాలోని ఇందుకూరుపేట పేట మండలం ముదివర్తి పాలెం వద్ద ఉన్న పెన్నా పొర్లు కట్ట తెగిపోవడంతో 5 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ముదివర్తి పాలెం, నిడు ముసలి, కె ఆర్ పాలెం, రాముడు పాలెం గ్రామాలు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. కృష్ణపట్నం చిన్న తూముల వద్ద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.