కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయిందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 'కాపీకాట్' రాజకీయాలు చేస్తోంది తెరాసనేనని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలను తారుమారు చేశారని, న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని ఆయన దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి సాయం చేయడానికి సీఏఏ, ఎన్ఆర్సీలపై మంత్రులు గందరగోళం సృష్టిస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు.
అలా లబ్ధి పొందారు
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకపోవటానికి కారణం తప్పుడు ఎన్నికల పద్ధతులేనని ఉత్తమ్ మండిపడ్డారు. ఎన్నికల ప్రకటన తేదీకి నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి లేకపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయని పేర్కొన్నారు. వార్డు రిజర్వేషన్లను తెరాస ముందుగానే తెలుసుకుని రాజకీయ లబ్ధి పొందిందని ఆరోపించారు. నోటిషికేషన్, నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి కావాలని మాత్రమే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.