Pawan Kalyan: ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రయత్నాన్ని బలంగా తీసుకెళ్తామన్నారు. నంద్యాల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. పాణ్యం మండలం కొనిదేడు గ్రామానికి చెందిన సుబ్బారాయుడు కుటుంబానికి పవన్ భరోసా ఇచ్చారు. కౌలు రైతు భార్య భూలక్ష్మికి లక్ష రూపాయల చెక్కు అందజేశారు.
అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఏపీని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి మరోసారి తీవ్ర నష్టం వాటిల్లుతందన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని.. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని అన్నారు. ఇవాళ్టికీ తమకు భాజపాతోనే పొత్తు ఉందని.. ఏపీ పరిస్థితిని తమ మిత్రపక్షం భాజపా నాయకత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.