తెలంగాణ

telangana

ETV Bharat / city

వారిని తలుచుకుంటే భయమేస్తుందంటోన్న పవన్ - పవన్ కల్యాణ్

అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. పదవి వెతుక్కుంటూ రావాలే గానీ దాని వెంట పడకూడదన్న జనసేనాని.. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా రావాలని అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఐటీ ప్రతినిధుల ముగింపు సమావేశంలో పవన్ ప్రసంగించారు.

pawan-kalyan-speech-at-janasena-party-it-members-meeting
pawan-kalyan-speech-at-janasena-party-it-members-meeting

By

Published : Aug 14, 2022, 8:53 PM IST

దేశ విభజన వల్ల ఎంతో రక్తపాతం జరిగిందన్న పవన్.. నాయకత్వానికి ముందు చూపులేకపోతే ఎన్నో దారుణాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత చరిత్రే దీనికి సాక్ష్యంమని అన్నారు. భారత దేశ జీవన విధానంలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉందన్న పవన్.. జాతీయ సమగ్రతాభావం కోల్పోకుండా మనందరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

కేవలం అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ అన్నారు. పార్టీ పెట్టగానే అద్భుతాలు జరుగుతాయని కూడా తాను అనుకోలేదన్నారు. కోట్లాదిమందికి నిర్దేశం చేయాలంటే రాజకీయంగా చాలా నలగాలన్న జనసేనాని.. గత దశాబ్దన్నర కాలంలో ఎన్నో అనుభవాలు సంపాదించినట్టు చెప్పారు. అనుభవం లేకుండా పదవులు వస్తే.. వైకాపా ప్రభుత్వం మాదిరి ఉంటుంద పవన్‌ ఎద్దేవా చేశారు. పదవి వెతుక్కుంటూ రావాలే గానీ.. పదవి వెంట పడకూడదని అన్నారు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా రావాలని పవన్‌ అభిప్రాయ పడ్డారు. స్థాయి, స్థోమత ఉందని భావిస్తే... ప్రజలే మనకు అవకాశం ఇస్తారని అన్నారు.

అధికార వైకాపా తీరును పవన్ ఎండగట్టారు. ప్రజల ఆశలతో ఆటాడి.. మభ్యపెట్టి.. ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. మద్యపాన నిషేధం, ఉపాధి కల్పన, సీపీఎస్‌ రద్దు వంటి హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని మండి పడ్డారు. ప్రజల ఆశలతో వైకాపా నాయకులు ఆటాడుతూ.. పాంజీ స్కీములు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వంపై స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తనకు వ్యక్తిగత ఆశలు.. భవిష్యత్ పై భయాలు లేవన్న పవన్.. రాబోయే తరాలను, వారి భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉంటుందని అన్నారు. వారికి తనవంతుగా ఏదైనా చేయాలని భావించి.. వారికోసమే అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు పవన్.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details