ముందుగా నర్సరీ.. అక్కడి నుంచి ఎల్‌కేజీ.. యూకేజీ.. ఆ తర్వాత ఒకటో తరగతిలోకి పిల్లలను పంపిస్తుంటారు. కరోనా పుణ్యమా అని.. రెండున్నరేళ్లుగా పాఠశాలలు సరిగా నిర్వహించలేదు. గత విద్యా సంవత్సరంలో తెరిచినా.. ప్రీప్రైమరీ తరగతులు నడవలేదు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో 3, 4 సంవత్సరాల వయసున్న చిన్నారులు ఇంటికే పరిమితమయ్యారు. తల్లిదండ్రులే వారికి వర్ణమాల వంటివి నేర్పించారు. కొందరు తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూటర్లను ఏర్పాటు చేయడం లేదా ఆన్‌లైన్ తరగతులలో చదువు చెప్పించడం వంటివి చేశారు. ఇప్పుడా పిల్లలను నేరుగా ఒకటో తరగతిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
ఆ స్థాయి అందుకునేదెలా..ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లల్లో దాదాపు 60-70 శాతం మంది ప్రీ ప్రైమరీలో అక్షరాలు తప్ప ఏమీ నేర్చుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతం యూకేజీ స్థాయిలోనే పర్యావరణంపై పాఠాలు ఉంటున్నాయి. పదాలు, వాక్యాలు రాసే స్థాయికి కిండర్‌గార్టెన్‌లో పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. ఇవేమీ లేకుండా నేరుగా ఒకటో తరగతిలో చేర్పించడంతో ఆస్థాయిని అందుకోవడం కష్టమవుతుందన్నది ఉపాధ్యాయులు చెప్పేమాట. దీన్ని నివారించేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సును తీసుకువచ్చాయి. నేరుగా ఒకటో తరగతిలో చేరిన పిల్లలకు ప్రాథమికాంశాలు నేర్పించి, ఆ తర్వాత రెగ్యులర్ పాఠ్యాంశాలు బోధిస్తున్నాయి.
‘‘ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లలకు అక్షరాలు రాయడమే వస్తోంది. వాక్య నిర్మాణం రావడం లేదు. అయినా వయసు రీత్యా అదే తరగతిలో చేర్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి లేఖలు తీసుకుని ప్రవేశాలు కల్పిస్తున్నాం.’’ అని కొండాపూర్‌లోని స్వాతి స్కూల్ కరస్పాండెంట్ ఫణికుమార్ వివరించారు.