వివాహ సమయంలో వరుడి తరఫువారడిగే లాంఛనాలు తీర్చడానికి వధువు తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. తన చిట్టితల్లి.. అత్తింట్లో ఆనందంగా బతకాలని ఆర్థిక భారమనే విషాన్ని కంఠంలో దాచుకుని కుమార్తె సంతోషం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు తల్లిదండ్రులు. ఇలా ఎంతో కష్టపడి వరుడు అడిగిన ప్రతీది చేయడానికి వారు శ్రమిస్తారు. పెళ్లప్పుడు అంగీకరించిన వరుడి కోర్కెలు తీర్చలేక కొన్నిసార్లు మానసికంగా ఎంతో కుంగిపోతారు.
పెళ్లి చేయలేక..
తమ కుమార్తె వివాహం నిశ్చయించుకుని ఏర్పాట్లకు సిద్ధమైన ఓ కుటుంబం.. ఆమె పెళ్లి చేయలేక అర్ధాంతరంగా ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌లో నివాసముండే ప్రకాశ్-గోవిందమ్మల పెద్దకుమార్తె రాధికకు వివాహం జరిపేందుకు జనవరి 11న నిశ్చయించారు. పెళ్లి ఖర్చులకు డబ్బు సమకూరక, ఏం చేయాలో పాలుపోని స్థితిలో తల్లి గోవిందమ్మ తన ఇద్దరు కుమార్తెలు రాధిక, రమ్యలతో కలిసి బంగారం మెరుగు పెట్టే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పెళ్లి చేసుకోలేక
త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతి అకస్మాత్తుగా శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. భూంపల్లికి చెందిన ప్రవళిక.. తన పెళ్లి చేస్తే కుటుంబంపై ఆర్థిక భారం పడుతుందని భావించి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లిపీటలెక్కాల్సిన కూతురు శవంగా తేలడం చూసిన ఆ తండ్రి గుండె ముక్కలయింది.
తాహతుకు మించి..
వరకట్నం ఇస్తేనే తమ ఆడబిడ్డ అత్తింట్లో గౌరవంగా తలెత్తుకుని బతుకుందని తల్లిదండ్రులు తాహతుకు మించి తమ కుమార్తెకు పెళ్లి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక భారం ఎక్కువై పెళ్లి చేయలేమోననే భయంతో కొందరు, వివాహమైన కూతుర్ని అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడం చూసి మరికొందరు, తమ పెళ్లి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదని ఆడపిల్లలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
మోయలేని భారం
ప్రాణం పోసిన తల్లిదండ్రుల పాలిట కట్నం.. మరణశాసనంగా మారుతోంది. ఎన్ని చట్టాలున్నా, ఎన్ని సవరణలు చేసినా.. నేటికీ ఆడపిల్లల తల్లిదండ్రుల నెత్తినుంచి వరకట్నపు భారాన్ని దించలేకపోతున్నాయి.