తెలంగాణ

telangana

ETV Bharat / city

Drugs: 'మా వాళ్లని జైల్లో పెట్టండి'.. కొందరి తల్లుల ఆవేదన!

మహానగరంలో గంజాయి వేలాది కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. పాఠశాల విద్యార్థులు.. కార్పొరేట్‌ ఉద్యోగుల వరకూ మత్తుకు అలవాటై బయటపడలేకపోతున్నారు. నెలరోజులుగా పోలీసు, అబ్కారీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో సుమారు 200-300 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. సుమారు 2000-3000 మంది వరకూ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇటీవల గంజాయితో పట్టుబడిన యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మా బ్యాచ్‌లో అమ్మాయిలకూ గంజాయి అలవాటు ఉందని, వాళ్లకు కౌన్సెలింగ్‌ ఇవ్వమంటూ డిమాండ్‌ చేయటం ఆశ్చర్యమనిపించిందని ఓ మనస్తత్వ నిపుణుడు తెలిపారు. పిల్లల ప్రవర్తన భరించలేని స్థితిలో వాళ్లను జైలుకు పంపమంటూ కన్నవారే కోరటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అప్పటికైనా వారిలో మార్పువస్తుందని ఆశ పడుతున్నారు. ఇప్పటి వరకూ గంజాయి తాగుతూ పట్టుబడిన వారిలో 20-30శాతం బానిసలుగా మారినట్టు అధికారులు గుర్తించారు. మనస్తత్వ నిపుణుల కౌన్సెలింగ్‌ ఇచ్చినా మారటం కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Parental suffering to get children out of drugs in Hyderabad
'మా వాళ్లని జైల్లో పెట్టండి'.. కొందరి తల్లుల ఆవేదన!

By

Published : Nov 8, 2021, 7:15 AM IST

Updated : Nov 8, 2021, 7:38 AM IST

‘‘మా అబ్బాయిని ఇప్పటికి పోలీసులు 30-40 సార్లు పట్టుకుని వదిలేసి ఉంటారు. ఈ అలవాటు వల్ల సరిగ్గా ఉద్యోగంలో కుదురుకోలేకపోతున్నాడు. వీడిని ఎలా దారికితీసుకురావాలో’’ -గంజాయి అలవాటు నుంచి కుమారుణ్ని ఎలా మార్చాలనేది అర్థంగాక కన్నతల్లి వెలిబుచ్చిన ఆవేదన.

‘పెళ్లయి ఇద్దరు పిల్లలున్న కుమారుడు. కుటుంబ బాధ్యతను తీసుకుంటాడనుకుంటే స్నేహితుల ద్వారా మత్తుకు అలవాటయ్యాడు. ఏడాదిగా నాలుగైదు ఉద్యోగాలు మారాడు. నాకు వచ్చే పింఛనుతో పిల్లలను సాకాల్సి వస్తోంది. 70 ఏళ్ల వయసులో మొదటిసారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చా’నంటూ కన్నీరు పెట్టుకున్నది ఓ మాతృహృదయం.

భయం.. భారం

మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కౌన్సిలింగ్‌ ముఖ్యమంటున్నారు మానసిక నిపుణులు. మారాలనే ఆలోచన, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే బయటపడవచ్చని సూచిస్తున్నారు. మార్పు రాకుంటే డీ-అడిక్షన్‌ కేంద్రంలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలు చికిత్సను భారంగా భావిస్తున్నాయి. నగరంలో పదుల సంఖ్యలో డీ-అడిక్షన్‌ కేంద్రాలున్నాయి. అక్కడ బాధితులకు అందించే సేవలకు తగినట్టుగా రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకూ వసూలు చేస్తున్నారు.

ఓపికతో మార్పు సాధ్యమే

మైకం నుంచి బయటపడాలని బలంగా భావించిన వారికి చికిత్స అందించటం తేలిక. దూల్‌పేట్‌లో కౌన్సిలింగ్‌లో రోజూ బాధితులపై పర్యవేక్షణ ఉంటుంది. మళ్లీ తప్పు చేయకుండా సైకాలజిస్టులు మాట్లాడుతున్నారు. దీనివల్ల వారిలో చాలామార్పు కనిపిస్తోంది. కౌన్సిలింగ్‌ ద్వారా మార్పురాకుంటే డీ-అడిక్షన్‌ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించాలి. పూర్తిగా కోలుకునేందుకు 6-7 నెలల వరకూ సమయం పడుతుంది. డిటాక్సిఫికేషన్‌, విత్‌డ్రా సిండ్రోమ్‌, డీ -అడిక్షన్‌ పద్ధతులతో మత్తు నుంచి బయటపడేలా చికిత్స చేస్తారు.

మానసిక వైద్యశాలలో సేవలు ఉచితం

మద్యం, గంజాయి, మాదకద్రవ్యాల అలవాటును మాన్పించేందుకు వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నాం. ప్రతి నెలా 90-100 మంది వరకూ వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది ఓపీ ద్వారా మందులు తీసుకుంటున్నారు. మత్తుపదార్థాల నుంచి బయటపడేసేందుకు ఆసుపత్రి ప్రాంగణంలో ‘డ్రగ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌’ సేవలు అందిస్తున్నాం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సేవలు పొందవచ్చు.

కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు సిద్ధం

అధికార యంత్రాంగం దూల్‌పేట్‌, మంగళ్‌హాట్‌పై ప్రత్యేక దృష్టిసారించటంతో మత్తురవాణాకు అడ్డుకట్ట పడినట్టయింది. దూల్‌పేట్‌ పరిధిలోనే 500-600 మంది గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. వీరికి స్థానిక ఎక్సైజ్‌ స్టేషన్‌లో మానసిక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నాం. ప్రస్తుతం వారి సంఖ్య తగ్గటంతో శనివారం మాత్రమే బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. మిగిలిన ప్రాంతాల్లోని బాధితులకు కౌన్సెలింగ్‌ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.

ఇదీచూడండి:డ్రగ్స్ కేసులో ఎన్​సీబీ విచారణకు ఆర్యన్​ఖాన్​ డుమ్మా

Last Updated : Nov 8, 2021, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details