Rain Effect in Telangana : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మిల్లుల్లోని ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నాయి. మూడు సీజన్లకు సంబంధించి సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మిల్లుల్లో ఉన్నాయి. వాటిల్లో సింహభాగం ఆరు బయట ఉన్నాయి. టార్పాలిన్లు కప్పి నిల్వ చేశారు. ఇటు కేంద్రం బియ్యం సేకరణను పునరుద్ధరించకపోగా ..ఆ ధాన్యాన్ని వేలం వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తర్జనభర్జన పడుతోంది.
మిల్లుల్లో తడిసిన ధాన్యం నుంచి మొలకలు
Rain Effect in Telangana : గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాన ధాటికి మిల్లుల్లోని ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్నాయి. మిల్లుల్లో ఆరుబయట టార్పాలిన్లు కప్పి నిల్వ చేసిన ధాన్యం తడిసి.. వాటి నుంచి మొలకలు వస్తున్నాయి.
నిర్మల్, ములుగు, వరంగల్ తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తడిసిన ధాన్యం నుంచి మొలకలు వస్తున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తుండంతో మిల్లుల్లోని ధాన్యం నిల్వల ఏ స్థితిలో ఉన్నాయన్నది గుర్తించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేపట్టింది. వర్షాలకు తడిసిన వడ్లను గుర్తించేందుకా లేక ఎంత మొత్తం వేలం వేయాలో అంచనాకా అన్నది తెలియడం లేదు.
బియ్యం సేకరణ పునరుద్ధరణ ఉత్తర్వులు సోమవారం కూడా వెలువడకపోవడంతో మిల్లర్లలో ఉత్కంఠ నెలకొంది. సీఎఫ్‌టీఆర్‌ఐ(మైసూర్) శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రయోగాత్మక మిల్లింగ్ నివేదిక అందింది. సగటున 31 కిలోల వరకు నూకలు వచ్చినట్లు సమాచారం.