ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 6 క్రయోజనిక్ కంటెయినర్లలో రాష్ట్రానికి 120 మెట్రిక్ టన్నుల ద్రవ ప్రాణవాయువు వచ్చింది. తొలి మూడు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా రాష్ట్రానికి ఇప్పటికే 307.25 టన్నుల ప్రాణవాయువు వచ్చింది. అయితే, లారీలను రైళ్లలో ఎక్కించి తీసుకెళ్లడం, అవి కదలకుండా తక్కువ వేగంతో నడపడం ద్వారా ఆక్సిజన్‌ను తీసుకురావడానికి ఎక్కువ సమయం పడుతోంది. లారీలను తీసుకెళ్లకుండా, పాలట్యాంకర్ల రైళ్ల తరహాలో నడిపితే ఆక్సిజన్ త్వరగా వస్తుందని, గంటకు 60 కి.మీ. వేగంతో ఆక్సిజన్‌ను తీసుకురావచ్చన్న సూచనలపై ద.మ.రైల్వే దృష్టి పెట్టింది.
రాష్ట్రానికి తొలి కంటెయినర్ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ - oxygen supply to telangana through container oxygen express
గూడ్సు రైళ్ల కంటే నెమ్మదిగా ప్రయాణిస్తున్న ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వేగం ఒక్కసారిగా పెరిగింది. గరిష్ఠ వేగం ఇప్పటివరకు గంటకు 43 కిలోమీటర్లు ఉండగా.. గురువారం చేరుకున్న నాలుగో ఎక్స్‌ప్రెస్ 58 కి.మీ. వేగంతో పరుగులు తీసింది. తెలంగాణకు ప్రాణవాయువును తీసుకువచ్చిన తొలి కంటెయినర్ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఇది. ఇప్పటివరకు రైలుపై ఖాళీ ట్యాంకర్లతో కూడిన లారీలను తీసుకెళ్లి ప్రాణవాయువును నింపుకొని వచ్చేవారు. తాజాగా లారీల అవసరం లేకుండా.. కంటెయినర్లను అమర్చిన రైలును నడిపించడంతో వేగం పెరిగింది.
ఈ మేరకు 12వ తేదీన ఝార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి 120 మెట్రిక్ టన్నుల ద్రవ ప్రాణవాయువును తెలంగాణకు తీసుకువచ్చేందుకు కంటెయినర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటుచేశారు. ఇది 1,400 కి.మీ. దూరాన్ని 24 గంటల్లో చేరుకుంది. గతంలో మాదిరి అయితే 32.5 గంటల సమయం పట్టేది. ఈ కంటెయినర్లను టాటానగర్‌లో క్రేన్ సహాయంతో లారీల్లోకి, లారీల్లో నుంచి రైళ్లలోకి దింపారు. గురువారం రాత్రి ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సనత్‌నగర్ స్టేషన్‌కు చేరుకోగా.. అందులోని 6 ఆక్సిజన్ కంటెయినర్లను క్రేన్ సహాయంతో లారీల్లోకి చేర్చారు.