Own Revenue in Telangana: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో రాబడి అంచనాలను అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకు సఫలీకృతం అవుతున్నాయి. రుణాలపై కేంద్రం ఆంక్షల నేపథ్యంలో సొంత రాబడులను పెంచుకునే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సొంత రాబడులు 75 శాతం దాకా ఉండగా గ్రాంట్ ఇన్‌ఎయిడ్ అంచనాల్లో రాబడి పదిశాతం వరకే పరిమితమైంది.
ఈ ఆరు నెలల్లో వాణిజ్య పన్నులశాఖ రాబడుల్లో 15 శాతం వృద్ధిరేటు నమోదైంది. అమ్మకం పన్ను, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ రాబడి అండగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రధానంగా పన్నేతర రాబడి అంచనాల్లో సుమారు 30 శాతానికి చేరుకోవడం ఊరట ఇచ్చే అంశంగా ఉంది. సొంత రాబడుల అంచనాల్లో సుమారు 40 శాతం వచ్చాయి. సెప్టెంబరు ఆఖరు వరకూ రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం జీఎస్టీ ద్వారా రాగా తర్వాతి స్థానంలో అమ్మకం పన్ను, మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల రాబడి, పన్నేతర రాబడి ఉన్నాయి. ప్రధానంగా పెట్రోలు, మద్యం అమ్మకం పన్నుతో పాటు వస్తు సేవల పన్నులు ఖజానాకు అండగా నిలిచాయి. పన్నుల రాబడిని రూ.1.26 లక్షల కోట్లుగా అంచనావేయగా 90%మేరకు లక్ష్యం చేరుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రూ.50 వేలకోట్ల దాకా రావడంతో మిగిలిన ఆరు నెలల్లో కనీసం రూ.60 వేలకోట్లు వస్తాయని భావిస్తున్నారు. సుమారు రూ.25 వేల కోట్ల పన్నేతర రాబడిని అంచనా వేయగా ఇప్పటివరకు మూడోవంతుదాకా సమకూరింది.
భూముల అమ్మకం: భూముల అమ్మకం ద్వారా పన్నేతర రాబడిని సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఇప్పటికే రూ.8 వేలకోట్లకు పైగా పన్నేతర రాబడి రాగా రానున్న రెండు నెలల్లో కనీసం మరో రూ.3 వేల కోట్లను సమకూర్చుకునేలా హెచ్‌ఎండీఏ ద్వారా భూముల వేలానికి ప్రయత్నిస్తోంది. వాణిజ్య పన్నులశాఖ మొండి బకాయిల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల మేరకు అంచనాలు వేయగా ఇప్పటికి సుమారు రూ.300 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన మొత్తంపై కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సుమారు రూ.7 వేల కోట్లు సమకూరాయి. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి ఆరు వేలకోట్లకు పైగా ఉండగా మిగిలిన మొత్తం రిజిస్ట్రేషన్ శాఖకు ఇతర రూపాల్లో అందింది.