అసాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. విశాల భారత పరిరక్షణ, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జరిగే పోరాటమిదని చెప్పారు. దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేవలం ఒక్క వ్యక్తి చెబితే 135 కోట్ల మంది వింటూ కూర్చోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని అభిప్రాయపడ్డారు. అసాధ్యమనుకున్న తెలంగాణను కేసీఆర్ సాధించారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి... ఇప్పుడు దేశాభ్యున్నతి కోసం ముందుకొస్తున్నారని కొనియాడారు. ఆయనతో కలిసి తానూ పోరాటంలో పాల్గొంటానని.. త్వరలోనే తాము మళ్లీ కలుస్తామన్నారు. ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం లేదని, అడ్డదారుల్లో పయనిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను రాజకీయాల కోసం వాడుకోవడం దారుణమని దుయ్యబట్టారు.
కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెరాస, కేసీఆర్ ఉన్నంత వరకు దేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో యశ్వంత్‌కు మద్దతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. హైదరాబాద్‌లో పలికిన అద్భుత స్వాగతం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. మోదీ పాలన ప్రజాస్వామ్యయుతంగా లేదు. చర్చలు, సంప్రదింపులు, ఉమ్మడి నిర్ణయాలుండవు. తనకు తోచిందే చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వాజ్‌పేయీ హయాంలో అయిదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నా. ఆ సమయంలో ఏ రోజూ ఐటీ, ఈడీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థల అధిపతులను పిలిచి మాట్లాడలేదు. రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక వ్యక్తిపై దాడులకు ఉసిగొల్పలేదు. ఇప్పుడంతా అదే జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని ఇలా ప్రశ్నించారో లేదో అలా నోటీసులిచ్చారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను గతంలో ఎవరూ ఇంతలా దుర్వినియోగం చేయలేదు.
ఫోన్ చేస్తే స్పందన లేదు..
రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేశాక ప్రధానమంత్రికి ఫోన్ చేశాను. తాను అందుబాటులో లేనని సిబ్బందితో చెప్పించారు. ఇప్పటి వరకు మళ్లీ ఫోన్ చేయలేదు. రాష్ట్రపతి అభ్యర్థికి కనీస గౌరవం ఇవ్వని వ్యక్తి ప్రధానిగా ఉండడం మన దౌర్భాగ్యం. అమెరికా అధ్యక్షుడు బడి పిల్లలనూ కలుస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మన ప్రధాని మాత్రం ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు.