నిత్యావసర సరకుల నిల్వ, నియంత్రణపై ఆంక్షలు, నియంత్రణను పూర్తిగా తొలగిస్తూ కొత్త చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీంతో పంట నిల్వలను బయటకు తీయకుండా వ్యాపారులు నియంత్రిస్తున్నారు. ధర పెరుగుతున్నందున పక్షం రోజుల క్రితం ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) వద్ద 56 వేల టన్నుల నిల్వలున్నాయి. వీటిని కిలో రూ.25లోపే విక్రయిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి.
ఎందుకీ కొరత..
దేశంలో 12.63 లక్షల హెక్టార్లలో ఉల్లి పంట సాగవుతోంది. గతేడాది(2019-20)లో దేశవ్యాప్తంగా 2.44 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. ఎక్కువగా ఉల్లి సాగుచేసే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలలో వర్షాలు బాగా కురవడంతో ఖరీఫ్ పంట పాడైంది. ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలంలో విదేశాలకు 1.20 కోట్ల టన్నులు ఎగుమతి చేశారు.