గతేడాది డిసెంబర్ నవంబర్ 27న రాత్రి 9 గంటల సమయంలో దిశ దారుణ హత్యకు గురైంది. సాయంత్రం శంషాబాద్‌లో తన ఇంటి నుంచి బయల్దేరి తొండుపల్లి బాహ్యవలయ రహదారి వద్దకు చేరుకున్న దిశ... తన ద్విచక్ర వాహనాన్ని రహదారి పక్కనే నిలిపి... చికిత్స కోసం క్యాబ్‌లో గచ్చిబౌలికి వెళ్లింది. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి క్యాబ్‌లో తొండుపల్లి గేట్ వద్దకు చేరుకుంది. దిశ వెళ్లే సమయంలోనే గమనించిన నిందితులు ప్రణాళిక ప్రకారం ఆమె ద్విచక్ర వాహనం వెనక టైరులో గాలి తీసేశారు. ద్విచక్ర వాహనం వద్దకు చేరుకున్న దిశ గాలి లేని విషయాన్ని గమనించి అక్కడే ఆగిపోయింది.
పథకం ప్రకారమే..
నలుగురు నిందితుల్లో ఓ యువకుడు అక్కడికి చేరుకొని టైరులో గాలి నింపుకొని వస్తానని అక్కడి నుంచి బయల్దేరాడు. చాలా సేపటికి కానీ అతడు రాలేదు. ఆ లోపు మిగతా ముగ్గురు దిశను బలవంతంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి... ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. బలంవంతంగా నోట్లో మద్యం కూడా పోశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన దిశ ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతంరం మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి లారీలో చటాన్‌పల్లికి తీసుకెళ్లారు. వంతెన కింద మృతదేహాన్ని కాల్చివేశారు. 28వ తేదీ తెల్లవారుజామున అటు నుంచి వెల్తున్న వ్యక్తి కాలిపోతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా... విషయం వెలుగులోకి వచ్చింది
ఎదురుకాల్పుల్లో..
నారాయణపేటకు చెందిన ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కస్టడీలోకి తీసుకొని నిందితుల నుంచి వివరాలు సేకరించేందుకు డిసెంబర్ 6 తెల్లవారుజామున ఘటన స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకొని, పోలీసు చేతిలో ఉన్న తుపాకులను లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు సీపీ సజ్జనార్ అప్పట్లో వెల్లడించారు. దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్నెళ్ల గడువు విధించింది.