తెలంగాణ

telangana

ETV Bharat / city

ONE IDLY -ONE RUPEE : రూపాయికే ఇడ్లీ.. ఎక్కడో తెలుసా..? - ap news

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆర్‌బీ. కొత్తూరు గ్రామానికి చెందిన చిన్ని రత్నం లక్ష్మి(రాణి), చిన్ని రామకృష్ణ(రాంబాబు) దంపతులు రూపాయికి ఒక ఇడ్లీని అమ్ముతూ నిరుపేదల కడుపు నింపుతున్నారు. అలాగే మైసూరు బజ్జీలనూ ఒక్క రూపాయికే విక్రయిస్తున్నారు.

one rupee plate idly
one rupee plate idly

By

Published : Aug 1, 2021, 4:34 PM IST

మీ ఊళ్లో ప్లేట్‌ ఇడ్లీ ఎంత? పాతిక, ముప్ఫై, యాబ్బై, డెబ్బయి.. అబ్బో.. ఇలా ధర పెరుగుతూ పోతుందే తప్ప తగ్గడం లేదు కదా. ఈ రోజుల్లో బయట టిఫిన్‌ తినాలంటే జేబులో తక్కువలో తక్కువ పాతిక రూపాయిలైనా ఉండాల్సిందే. అలాంటిది రూపాయికే ఇడ్లీ... బజ్జీ అందిస్తూ దాదాపు పది రూపాయల్లో శుభ్రంగా కడుపు నిండేలా చేస్తున్నారు ఈ దంపతులు.

వీళ్లు అందిస్తున్న టిఫిన్ల గురించి తెలుసుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆర్‌బీ. కొత్తూరు గ్రామానికి వెళ్లాల్సిందే. ఆర్‌బీ. కొత్తూరు గ్రామం నుంచి సామర్లకోట మండలం వేట్లపాలెం వెళ్లే రహదారిలో షిర్డీసాయిబాబా గుడి ఉంది. దీని పక్కన ఆ గ్రామానికి చెందిన చిన్ని రత్నం లక్ష్మి(రాణి), చిన్ని రామకృష్ణ(రాంబాబు) దంపతులు ఇంటి బయట చిన్నపాటి కాకా హోటల్‌ నడుపుతున్నారు. వీరు గత 16 ఏళ్లుగా దీన్ని నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం రూపాయికే ఇడ్లీ, మైసూరు బజ్జీలను అందిస్తున్నారు. ఈ హోటల్‌ను భార్యాభర్తలు, రామకృష్ణ అత్తగారు ముగ్గురూ కలిసి ఉదయం నాలుగు గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తారు.

వీరే అన్ని పనులూ చేసుకుంటారు. ఉదయం అయిందంటే చాలు ఈ హోటల్‌కు జనం క్యూ కడతారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ మండిపోతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం రూపాయికే వీటిని ఎలా అందించగలుగుతున్నారన్న దానికి.. డబ్బు ఆర్జించడమేకాదు ఎంతో కొంత సమాజానికి ఈ రకంగా సేవ చేయాలనే దృక్పథంతో నిర్వహిస్తున్నామని అంటున్నారీ జంట. రోజుకు ఇక్కడికి సుమారు 500 మంది వినియోగదారుల వరకు వస్తారని ఆనందంగా చెబుతున్నారు.

ఇదీ చూడండి: polavaram: పోలవరం వరద కష్టాలు.. గ్రామాలను వదిలిపోతున్న నిర్వాసితులు

ABOUT THE AUTHOR

...view details