తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు... ఉరకలెత్తుతున్న వాగులు, వంకలు..

Telangana Rains Today: అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా జిల్లా మోస్తరు నుంచి తేలికపోటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వానతో.... వాగలు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Telangana Rains Today
Telangana Rains Today

By

Published : Jul 9, 2022, 10:59 AM IST

Updated : Jul 9, 2022, 3:18 PM IST

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు... ఉరకలెత్తుతున్న వాగులు, వంకలు..

Telangana Rains Today: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రోడ్లన్నీ జలమయం కాగా... ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హెచ్చుతగ్గులతో ఏకధాటిగా కురుస్తున్న వానతో.... జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్లకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో.. జీహెచ్​ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, అత్యవర బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. అత్యవసర పనులకు తప్పితే అనవసరంగా ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

వరంగల్​ జిల్లాలో..: వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయ్. కాజీపేట, హనుమకొండ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో వాహనదారులు తడిసిముద్దౌతున్నారు. రహదారుల్లో ఉన్న గంతుల్లో వర్షపునీరు చేరడంతో...వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. వర్షం కారణంగా జిల్లాలోని చెరువులు పొంగి....ప్రవహిస్తున్నాయి. ఘనపురం మండలం మోరంచ వాగు ఉథృతంగా ప్రవహిస్తోంది. మహాముత్తారం మండలం కాటారం-మేడారం ప్రధానరహదారి లోలెవెల్ వంతెననుంచి పెద్దవాగు పొంగి ప్రవహిస్తుండడంతో....పరిసర ప్రాంతాల్లోని 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయ్. మహాముత్తారం యామనపల్లి మార్గంలో అలుగు వాగు పొంగి ప్రవహిస్తుండడంతో....పరిసర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయ్. పెగడపల్లి పెద్దవాగు పొంగి ప్రవహించడంతో..సమీపంలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోణంపేట, దొబ్బాలపాడు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మల్హర్ మండలం... మానేరు, మల్లారం ఆరె వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో...చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

మహబూబాబాద్ జిల్లాలో..: మహబూబాబాద్ జిల్లా గార్లలో వంతెన పైనుంచి...పాకాల ఏరు ప్రవహిస్తుండడంతో.... రాంపురం, మద్దివంచ, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు బయ్యారం పెద్ద చెరువు భారీ వర్షాలతో అలుగు పారుతోంది. నల్గొండ జిల్లా అన్నెపర్తిలో వానలకు ప్రహరీ గోడ కూలి 10 గొర్రెలు మృతి చెందాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో..: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. భీంగల్ మండలం కప్పలవాగు చెక్‌డ్యామ్ పైనుంచి వర్షం నీరు పారుతోంది. నవీపేట మండలం జన్నపల్లిలో పెద్దచెరువు అలుగుపారుతోంది. లింగాపూర్ శివారులో వరదధాటికి తుంగినిమాటు కాల్వకు గండిపడి... వందల ఎకరాల్లో వరి పంటలు నీటమునిగాయి. ఇందల్వాయి చిన్నవాగు తాత్కాలిక వంతెన తెగిపోయింది. బీర్కూరు మండలం అన్నారంలో పంటపొలాల్లోకి వరద నీరు చేరింది. భిక్కనూరు మండలం మల్లుపల్లిలో భారీవానకు ఇల్లు కుప్పకూలింది. భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్​ జిల్లాలో..: ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో జోరువానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బోథ్ ప్రాంతంలో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు ఉప్పొంగి... రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇచోడ, నెరడిగొండ, బజార్హట్నూర్, సిరికొండ మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో కుబీర్‌లో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నీటమునిగింది. విఠలేశ్వరాలయంలోకి వరద నీరు చేరింది. బిద్రేల్లి వద్ద రహదారిపై పొంగి ప్రవహిస్తున్న వాగుతో... రాకపోకలు నిలిచిపోయాయి.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..:ఎడతెరపి లేని వర్షాలతో సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మోటార్ల సాయంతో వరద నీటిని బయటికి పంపుతున్నారు.. గనుల్లోని రోడ్లన్నీ బురదమయమవటంతో... మట్టి వెలికితీత పనులు సైతం నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్, మందమర్రి ఉపరితల గనుల్లో బొగ్గుగ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు సింగరేణి ఏరియాలో వర్షం కారణంగా 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల ఉపరితల గనిలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 24 వేల మేర ఇక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతోపాటు, 2లక్షల 70 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీత పనులు ఆగిపోయి.. కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు సంస్ధ అధికారులు తెలిపారు. భూపాలపల్లిలోనూ సింగరేణి ఉపరితల గనుల్లోనూ దాదాపు 12 వేల టన్నుల మేర ఉత్పత్తికి సుమారు మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 9, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details