రాష్ట్రంలోని పురపాలికల్లో నేతలకు కాంట్రాక్టుల పందేరం నడుస్తోంది. పనుల్ని ముక్కలు చేసి యంత్రాంగం పంచేస్తున్నది. క్రీడా ప్రాంగణాలు, వనాల అభివృద్ధి పేరుతో మాయ చేస్తుంది. పలు అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అనేక పట్ణణాలు, నగరాల్లో నామినేషన్‌పై పనులను పంచే జాతర సాగుతోంది. పురపాలిక అధికారులు అత్యవసరం పేరుతో స్వామి కార్యం.. స్వకార్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా నామినేషన్‌పై పనులను అప్పగిస్తున్నారు. అత్యవసరమైన పని.. అదీ రూ.5 లక్షల లోపు విలువైనదైతేనే నామినేషన్‌పై ఇవ్వాలనే నిబంధనను అనువుగా చేసుకొంటున్నారు. అత్యవసరం పేరుతో కోట్ల రూపాయల పనులను రూ.5 లక్షలు లేదా రూ.4.99 లక్షల చొప్పున విడగొట్టి కావాల్సిన వారికి పంచిపెట్టేస్తున్నారు. పట్టణ ప్రగతి కింద పలు చోట్ల ఇలా అప్పగిస్తున్నారు. పట్టణ ప్రకృతి వనాలు, హరితవనాలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పేరుతో అత్యధిక చోట్ల నామినేషన్‌పై ఇచ్చేస్తున్నారు. చాలాచోట్ల వాటిని చేస్తోంది స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు...వారికి కావాల్సిన గుత్తేదార్లు. వారు తూతూ మంత్రంగా పూర్తి చేసి లక్షలు స్వాహా చేస్తున్నారు. నాణ్యతకు పాతరేస్తున్నారు. నామినేషన్‌పై ఇష్టారాజ్యంగా పనులను అప్పగించడం చెల్లదని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) స్పష్టం చేసింది. తప్పనిసరి లేదా అత్యవసరమైన సందర్భాల్లోనే అలా చేయాలని ఆదేశించింది. సీవీసీ మార్గదర్శకాలను పాటించాలని గత ఏడాది జులైలో రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లను ఈ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆదేశించారు. దీన్ని పురపాలికలు బేఖాతరు చేసి నామినేషన్‌పై పనులు అప్పగిస్తున్నాయి.
గద్వాలలో 28 ముక్కలు
గద్వాల పట్టణంలో గత ఏడాది రూ.1.4 కోట్ల విలువైన 28 పనులను నామినేషన్‌పై అప్పగించారు. వివిధ వార్డుల్లో ట్రీ పార్కులకు పాత్‌వే, గ్రీనరీ, చైన్‌లింక్ మెష్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. చాలాచోట్ల అరకొరగా చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆరో వార్డులో సెకండ్ రైల్వేగేట్ సమీపంలోని ట్రీపార్క్‌లో సిమెంట్ దిమ్మెలకోసం రూ.5 లక్షలు వ్యయం చేశారు. నిర్దేశించిన పనులు ఏమిటో.. అక్కడ జరిగిందేమిటో అంతుపట్టని పరిస్థితి.
మిర్యాలగూడలో ఉన్నమైదానం అభివృద్ధి పేరుతో..
మిర్యాలగూడ మున్సిపాలిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలికల ఉన్నతపాఠశాలలో క్రీడా ప్రాంగణం ప్రారంభించారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న క్రీడా మైదానం. అక్కడ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ కోర్టులు ఉన్నాయి. రూ.5 లక్షలతో నామినేషన్‌పై అప్పగించిన పనిలో భాగంగా అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా శిలాఫలకం వేసి ప్రారంభించారు. బోర్డు ఏర్పాటు చేశారు. పనులు చేశారా? చేస్తారా? అంటే పురపాలక అధికారుల నుంచి స్పందన లేదు.