అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అవసరమైనన్ని ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తాం. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం.
- శ్రీకాకుళం, రాజాం పాదయాత్రలలో జగన్
ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు డీఎస్సీ ప్రకటించలేదు. తాజాగా ఇచ్చిన ఉద్యోగాల క్యాలెండర్లోనూ ఈ నియామకాల ప్రస్తావన లేదు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ ఖాళీల కారణంగా విద్యార్థులకు సరైన విద్య అందని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో అయిదు తరగతులకు ఒక్కరే టీచర్ ఉంటుండగా... ఉన్నత పాఠశాలల్లో చాలాచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. 2018 తర్వాత నియామకాలకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రకటించినా అమలు కాలేదు. దీంతో ఎనిమిది వేలకుపైగా బడులు ఒక్కో ఉపాధ్యాయుడితోనే కొనసాగుతున్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో 1,795 వరకు సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. అన్ని స్థాయిల్లో కలిపి 16 వేల వరకు ఖాళీలు ఉన్నాయి. చాలాచోట్ల సాంఘిక, జీవశాస్త్రం ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడితో కలిపి తొమ్మిది పోస్టులు ఉండాల్సి ఉండగా... కొన్నిచోట్ల అయిదారుగురు మాత్రమే పని చేస్తున్నారు. ఏకంగా 400 ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులే లేరు. గతేడాది డిసెంబరులో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ... క్షేత్రస్థాయిలో మాత్రం ఏకోపాధ్యాయ బడుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 30,367 ఉండగా... వీటిల్లో 33 బడులకు ఒక్క టీచరూ లేరు. ఇవి డిప్యూటేషన్పైనే కొనసాగుతున్నాయి. మరో 8,958 పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే కొనసాగుతున్నాయి. ఇలా చూసుకున్నా తొమ్మిది వేల మందికిపైగా ఉపాధ్యాయులు అవసరం కానున్నారు. పునాది స్థాయిలో బోధనతోపాటు పర్యవేక్షణ గాడి తప్పుతోంది. ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెడితే పాఠశాలకు సెలవు ఇవ్వాల్సి వస్తోంది. పక్క పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను పంపిస్తున్నా కొద్దిరోజులే డిప్యూటేషన్ కావడంతో కొత్తగా వెళ్లిన టీచర్ సరిగా పట్టించుకుంటున్న దాఖలాలు ఉండడం లేదు.
భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య
గతంతో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఆరు లక్షల మందికిపైగా కొత్తగా చేరారు. ఈ లెక్కన పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు అవసరమవుతారు. రాష్ట్రంలో 1,795 సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కాగితాల్లోనే అధికారుల ప్రతిపాదనలు
ఉద్యోగ క్యాలెండర్ కోసం ఖాళీల వివరాలు కోరిన సమయంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. వీటిల్లో ఒక్క సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే 14,061 వరకు ఉన్నాయి. మిగతా వాటిల్లో సబ్జెక్టు టీచర్ పోస్టులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,86,475 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గత డిసెంబరులో బదిలీలు నిర్వహించిన సమయంలో సుమారు 16 వేల పోస్టులను బ్లాక్ చేశారు. ఈ లెక్కన దాదాపుగా ఆ పోస్టులన్నీ ఖాళీలే. డీఎస్సీ-2008కు చెందిన అర్హులైన 2,193 మందిని ఎస్జీటీలుగా నియమిస్తున్నారు. ఈ సంఖ్యను మినహాయించినా.. దాదాపు మరో 12 వేల ఎస్జీటీ పోస్టులు అవసరం కానున్నాయి.