Night curfew in Yanam: కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా.. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నిన్నటి నుంచి (జనవరి ఒకటి) రాత్రి కర్ఫ్యూ అమలులోకి వచ్చిందని అక్కడి డిప్యూటీ కలెక్టర్ అమన శర్మ తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి, కర్ఫ్యూ సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై తగిన సూచనలు చేశారు.
కర్ఫ్యూపై అవగాహన..
పర్యాటక ప్రాంతమైన యానాంకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో వారి వివరాలు సేకరించడం, కరోనా లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక శిబిరాలకు తరలించడం, విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే స్థానికులు రాత్రి 11 గంటలలోపు స్వస్థలాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయం దాటిన తరువాత ప్రవేశం ఉండదని డిప్యూటీ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయిస్తున్నామన్నారు.
'ప్రభుత్వ నిబంధనలకు లోబడి యానాంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. జనవరి ఒకటో తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిబంధనలు అమలులో ఉంటాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే స్థానికులు రాత్రి 11 గంటలలోపు స్వస్థలాలకు చేరుకోవాలి. నిర్ణీత సమయం దాటిన తరువాత ప్రవేశం ఉండదు.'