NIA CUSTODY PETITION ACCEPTED: అతివాద సంస్థ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'(పీఎఫ్ఐ) కార్యాలయాలు, నేతల ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్న వేళ తెలుగు రాష్ట్రాలకు చెందిన నిందితులను విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ నెల 18న తెలుగు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోనే 38 చోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అరెస్ట్ చేసిన నిందితులు సయ్యద్ యాహియా సమీర్, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్, మహ్మద్ ఇర్ఫాన్‌లను కోర్టులో హజరుపరిచిన పోలీసులు.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నలుగురిని 30 రోజుల కస్టడీ కోరుతూ..... ఈ నెల 20న ఎన్ఐఏ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నలుగురిని అధికారులు మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకువెళ్లి, విచారణ జరుపుతున్నారు.