టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి పార్టీ కార్యకలాపాల వేగం పెంచారు. ఒక వైపు ఇంటిని చక్కదిద్దుకుంటూనే.. మరోవైపు అధికార తెరాస, భాజపాల ప్రజావ్యతిరేక విధానాలపై తూటాల్లాంటి మాటలతో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ... నిత్యం ప్రజల్లో ఉండేటట్లు కార్యాచరణపై ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఏఐసీసీ పిలుపు మేరకు మొట్టమొదటగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడానికి పార్టీ శ్రేణులు చురుకైన పాత్ర పోషించాయి. ఈ నెల 16న ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... దాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సందిస్తున్న రేవంత్ రెడ్డి.. నిరుద్యోగ సమస్యపై 48 గంటల దీక్షకు సిద్ధమవుతున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్‌పై ఫోకస్...
మరోవైపు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి... తెరాస, భాజపాలు ఇప్పటివరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్‌ను ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా మొదలుపెట్టారు. కౌంటర్ గేమ్‌కు తెర తీసి.. తెరాస, భాజపాలోని బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి సారించారు. పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు తెరాస, భాజపా ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహాలతో విలవిలలాడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో... తనదైన శైలిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీల నాయకుల బలబలాలు.. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తున్నారు.
చేరికలతో సమాధానం..
హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని చూసిన తెరాసకు అదే తరహాలో దెబ్బ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని తెరాస చూస్తే ఆ మరుసటి రోజునే.. తెరాస, భాజపాకు చెందిన నాయకులను తమవైపు లాకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరారు. ముదిరాజ్ సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా పేరున్న ఎర్ర శేఖర్... కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పార్టీకి బలాన్నిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు.. మాజీ మేయర్, తెరాస నేత ధర్మపురి సంజయ్ సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు చొరవ చూపారు. సంజయ్ చేరిక.. అటు ఎంపీ అరవింద్‌కు, ఇటు తెరాసకు ఇది గట్టి దెబ్బ అని అంటున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సంజయ్ నిజామాబాద్ జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుని బాధ్యతలు తీసుకున్న తర్వాత... కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సంజయ్ వెల్లడించారు.
కొండా చేరికపై ఉత్కంఠ..
ఇక భూపాలపల్లి జిల్లా తెరాస రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన గండ్ర సత్యనారాయణ రావు కూడా రేవంత్‌ను కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరో వైపు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయిన రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని తెలిపారు.
రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మరో వైపు వివిధ పార్టీల నేతలు రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఇప్పటికే తనతో టచ్‌లో ఉన్నట్లు స్వయంగా రేవంత్ రెడ్డే వెల్లడించారు. గడ్డు పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌లోకి వలసల హడావుడి చూస్తుంటే రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.