తెలంగాణ

telangana

ETV Bharat / city

Olympics: ఫలించిన భారత్​ కల- నీరజ్​ చోప్రాకు స్వర్ణం

జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచి సంచలనం సృష్టించాడు నీరజ్​ చోప్రా. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో 100 ఏళ్ల భారత్​ కలను నేరవేర్చాడు. స్వర్ణం గెలిచి భారత్​ గర్వించేలా చేశాడు. ఈ స్వర్ణంతో కలిపి టోక్యో ఒలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య ఏడుకు( ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది.

Neeraj Chopra
Neeraj Chopra

By

Published : Aug 7, 2021, 6:36 PM IST

ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కల ఫలించింది. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచిన యువ సంచలనం నీరజ్​ చోప్రా మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు ఎన్నో ఆశలు.. అంచనాలతో టోక్యోకు వెళ్లి స్వర్ణం గెలిచి భారత్​ గర్వించేలా చేశాడు.

జావెలిన్​ను అత్యుత్తమంగా 87.58 మీ. దూరం విసిరాడు నీరజ్​. రెండో ప్రయత్నంలోనే ఈ మార్కును అందుకున్నాడు. చెక్​ రిపబ్లిక్​కు చెందిన వాద్లెచ్​ జాకుబ్​(86.67), వెసెలీ విటెజ్​స్లావ్​(85.44) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.

1900 పారిస్​ ఒలింపిక్స్​లో నార్మన్​ ప్రిచర్డ్​(బ్రిటీష్​ ఇండియా) అథ్లెటిక్స్​లో ​(200 మీ. హర్డిల్డ్​, 200 మీ. స్ప్రింట్స్​) భారత్​కు రెండు రజత పతకాలు అందించాడు. 120 ఏళ్ల తర్వాత.. మళ్లీ నీరజ్​ చోప్రా ఇప్పుడు బంగారు పతకం నెగ్గి చరిత్ర సృష్టించాడు.

బింద్రాను దాటి..

భారత్‌కు ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

ఇదే అత్యుత్తమం..

ఈ స్వర్ణంతో కలిపి టోక్యో ఒలింపిక్స్​లో భారత పతకాల సంఖ్య ఏడుకు( ఓ స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. ఇప్పటివరకు విశ్వక్రీడల్లో ఇండియా​కు ఇదే అత్యుత్తమం. 2012 లండన్​ ఒలింపిక్స్​లో భారత్​ 6 పతకాలు సాధించింది.

తొలి ప్రయత్నంలోనే..

ఫైనల్లో తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు దూరం విసిరిన నీరజ్​.. రెండో సారి 87.58 మీ. దూరం విసిరి టాప్​లో నిలిచాడు. ఏ దశలోనూ అతడికి పోటీ లేకుండా పోయింది.

ఫైనల్లో మొత్తం అథ్లెట్లకు ఆరు సార్లు జావెలిన్​ విసిరే అవకాశం ఉంటుంది. తొలి మూడు ప్రయత్నాల తర్వాత.. టాప్​-8 ప్లేయర్లకు మరో 3 ఛాన్స్​లు ఉంటాయి.

క్వాలిఫికేషన్‌లోనే 86.59 మీటర్ల త్రోతో ఫైనల్​కు అర్హత సాధించి.. పసడి అందిస్తానని సంకేతాలు పంపాడు చోప్రా.

అన్నింటా రికార్డులే..

ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020 జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.

ఇదీ చూడండి: భారత్ భళా- ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన ఇదే..

ABOUT THE AUTHOR

...view details