కరోనా నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఇందుకోసం నానో పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే గచ్చిబౌలిలోని దీక్ష మినరల్స్ కంపెనీ ఆధ్వర్యంలో డి-నానో పేరిట నానోకణాలను ఉపయోగించి ప్రత్యేక డిస్‌ఇన్ఫెక్టంట్స్‌ను తయారు చేస్తున్నారు. వీటి కారణంగా పరిసరాల్లో రోజుల తరబడి వైరస్, బ్యాక్టీరియా ఎదగకుండా నియంత్రించవచ్చు. జేఎన్‌టీయూలోని నానోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ కె.వెంకటేశ్వరరావు సహకారంతో మరింత ప్రభావవంతమైన నానో పదార్థాలతో కూడిన ద్రావణాలను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి జరుగుతోంది. ఈ మేరకు దీక్ష మినరల్స్... జేఎన్‌టీయూతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
నేరుగా బ్యాక్టీరియా, వైరస్ కణాలపై దాడి
నానో కణాలతో తయారు చేసిన ద్రావణాలు వైరస్, బ్యాక్టీరియాపై ప్రభావవంతంగా పనిచేయడంతో పాటు వాతావరణానికి ఎలాంటి హాని లేకుండా చేస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కొవిడ్-19 విస్తరిస్తున్న దశలో పరిసరాలను నానో కణాలతో తయారు చేసిన ద్రావణాలతో శుభ్రం చేస్తే నెల రోజుల వరకు వైరస్ లేదా బ్యాక్టీరియా ఆ ప్రాంతంలో వృద్ధి చెందదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ‘నానో పదార్థాలతో చేసిన ద్రావణాలు వైరస్, బ్యాక్టీరియాపై సమర్థంగా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది’ అని జేఎన్‌టీయూ నానో సైన్స్ ఆచార్యుడు ప్రొ.కె.వెంకటేశ్వరరావు తెలిపారు. త్వరలో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు