తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏలూరులో ఏం జరుగుతోంది?... ప్రజల అస్వస్థతకు కారణమేంటి?

ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు స్పృహ కోల్పోతున్నారు. అస్వస్థతకు గురైన వారితో ప్రభుత్వాసుపత్రి నిండిపోయింది. ప్రతి అర గంటకు సగటున ఒకరు చొప్పున ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రస్తుత పరిస్థితి. ఇంతకీ వారు అనారోగ్యానికి గురవడానికి కారణమేంటి?. ప్రభుత్వం ఏం చెబుతోంది?

eluru
eluru

By

Published : Dec 6, 2020, 6:02 PM IST

ఏలూరులో ఏం జరుగుతోంది?... ప్రజల అస్వస్థతకు కారణమేంటి?

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణ వీధిలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా మూర్ఛ, వాంతులు, కళ్లుతిరగం, నోటి నుంచి నురగరావడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఒకరి తరువాత ఒకరు కింద పడిపోతున్నారు. రాత్రి అయ్యే సరికి అనేక కాలనీల్లోనూ ఇదే పరిస్థితి. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా 60 నుంచి 80 మంది వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారని సమాచారం. ఆదివారం మధ్యాహ్నం సమయానికి మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 300పైగా ఉంది.

ప్రభావిత ప్రాంతాలు

నగరంలోని దక్షణవీధి, పడమరవీధి, తాపీమెస్త్రీవీధి, తంగళ్లమూడి, అశోక్ నగర్, కొత్తపేట, అరుంధతిపేట, కొబ్బరితోట వీధి, వంగాయగూడెం, ఆదివారపుపేట ప్రాంతాల నుంచి అధికంగా అస్వస్థతకు గురయ్యారు.

అంతు చిక్కని వ్యాధి

ఏలూరులో ప్రజలు ఆస్వస్థతకు గురై 24గంటలు గడుస్తున్నా.. కారణాలు మాత్రం నిర్ధరణ కాలేదు. శనివారం రాత్రి నుంచి బాధితులకు అన్ని పరీక్షలు నిర్వహించారు. బాధితుల్లో ఎలాంటి వైరస్​ లక్షణాలు బయటపడలేదని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన వారందరికీ కొవిడ్ పరీక్షల్లోనూ నెగిటివ్​గా తేలిందని వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.

ప్రాణాపాయం లేదు

శనివారం రాత్రి నుంచి బాధితులకు జరిపిన పరీక్షల్లో ఎలాంటి వ్యాధి నిర్ధరణ కాలేదు. వైరల్, బ్యాక్టీరియా వంటి పరీక్షల్లోనూ నెగిటివ్​గా తేలింది. కొవిడ్ పరీక్షల్లోనూ నెగిటివ్​ వచ్చింది. నగరంలో 22 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షించాం. ఎలాంటి కలుషిత లక్షణాలు కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించాం. మిగతా వారందరి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. కొందరు భయంతో ఆసుపత్రికి వస్తున్నారు.

- ఆళ్ల నాని, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

బాధితులు ఉన్న ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ శిబిరాలు నిర్వహిస్తోంది. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి :ఏలూరులో మరో 46 మందికి అస్వస్థత.. 300 దాటిన బాధితుల సంఖ్య..!

ABOUT THE AUTHOR

...view details