తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన మటన్​ వినియోగం - మటన్​ వినియోగం

రాష్ట్రంలో మాంసం వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మటన్‌ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. గుడ్డు, చికెన్‌తో పోలిస్తే ధర అధికమైనా.. గొర్రె, మేక మాంసం తినేందుకు వెనుకాడటం లేదు. ఇదే అదునుగా కొందరు రేట్లు అమాంతం పెంచేశారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో అన్నిచోట్ల ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాల్లో నాణ్యత, తాజాదనం ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన మటన్​ వినియోగం
రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన మటన్​ వినియోగం

By

Published : Sep 30, 2020, 5:47 AM IST

రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన మటన్​ వినియోగం

రాష్ట్రంలో రోజురోజుకు మాంసం వినియోగం పెరిగిపోతోంది. కరోనా నేపథ్యంలో చికెన్‌, గుడ్డుతో పోల్చుకుంటే ధరలు అధికమైనా కూడా వినియోగదారులు మాత్రం గొర్రె, మేక మాంసం తింటున్నారు. రోగ నిరోధక శక్తి పెంపు కోసం అధిక ప్రొటీన్లు ఉన్న మాంసాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలన్న వైద్యుల సూచనలతో... మాంసాహార ప్రియులు మటన్‌ తినేందుకు ఇష్టపడుతున్నారు. దేశంలో మాంసం వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా.. ప్రస్తుతం ఆ వాడకం మరింత పెరిగిపోతోంది. 2019-20లో 9.65 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం విక్రయాలు జరగ్గా... ఈ ఏడాది 6 నెలల్లోనే 6.14 లక్షల మెట్రిక్ టన్నులు పైగా వినియోగించారు.

కిలో మటన్‌ రూ.1000పైగా విక్రయించినా...

కరోనా కట్టడి కోసం మార్చి 22న కేంద్రం లాక్‌డౌన్ విధించినప్పుడు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఔషధ, మాంసం, చికెన్ దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో చికెన్‌పై దుష్ప్రచారం జరగడంతో... అందరూ మటన్‌ వైపు మొగ్గు చూపారు. ఇదే అదనుగా కిలో మటన్‌ ధర రూ.900 నుంచి రూ.1000పైగా విక్రయించినా... వినియోగదారులు కొనుగోలు చేశారు. గతంలో వారానికి ఒకసారి తినేవాళ్లమని... కరోనా వల్ల రెండుసార్లైనా తింటున్నామని వినియోగదారులు చెబుతున్నారు

పెంపకంలోనూ.. వినియోగంలోనూ తొలిస్థానమే

2017-18లో ఏడాది ఎంత మాంసం వినియోగం జరిగిందో... కేవలం ఈ ఆర్ధిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే అంత వినియోగం జరిగింది. కరోనా ముందు.. తర్వాత పోల్చుకుంటే పెద్దఎత్తున గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. 2019-20లో గొర్రెలు, మేకలు కలిపి 50 వేలు తెగగా... ఇప్పుడు రోజుకు 60వేలుపైగా తెగుతున్నాయి. ఇందులో 25శాతంపైగా హైదరాబాద్‌లోనే కోసేస్తున్నారు. గొర్రెల పెంపకంలో రాష్ట్రానిదే తొలిస్థానం. వినియోగంలోనూ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 90 శాతం మంది మాంసాహారులే ఉండటం విశేషం. సాధారణంగా దసరా, బక్రీద్ వంటి పండుగల సమయాల్లో మాంసం వినియోగం రికార్డ్ స్థాయిలో ఉంటుంది. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 500 మెట్రిక్ టన్నుల యాట మాంసం వినియోగమవుతోంది.

ధరలు పెరుగుదల, నాణ్యత లేమిపై త్వరలనే..

రాష్ట్రమే కాకుండా... వివిధ రాష్ట్రాల నుంచి జీవాలు దిగుమతి అవుతున్నా.. కొన్నిచోట్ల ఇష్టారితీన రేట్లు పెంచి అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధిక ధరలు, కల్తీలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. మాంసం ధరలు పెరుగుదల, నాణ్యత లేమి వంటి అంశాలపై త్వరలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చూడండి:మాయదారి పరీక్ష.. సామాన్యులకు శిక్ష..

ABOUT THE AUTHOR

...view details