ఆంధ్రప్రదేశ్లో పురపాలక ఎన్నికల వేళ కొన్ని రోజులుగా అభ్యర్థుల ప్రచారంతో మార్మోగిన నగరాలు, పట్టణాల్లో ఒక్కసారిగా ప్రశాంతత నెలకొంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియగా.. చివరి నిమిషం వరకూ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం సాగించారు. 12 కార్పొరేషన్లు, 75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఏకగ్రీవాలు పోనూ మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్లో ఎన్నికలు ఆగిపోయాయి. మిగిలిన 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈనెల 10న పోలింగ్ జరగనుంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
కార్పొరేషన్లలో 582 డివిజన్లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లోని అన్ని వార్డులు కలిపి మొత్తం 2,215 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికోసం 7,915 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 78,71,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీటిలో 38,72,264 మంది పురుష ఓటర్లుండగా..39,97,840 మహిళా ఓటర్లు ఉన్నారు.