తెలంగాణ

telangana

ETV Bharat / city

మెుదటి పురపాలక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతం - మున్సిపల్​ ఎన్నికలు

పురపోరులో భారీ ఓటింగ్ నమోదైంది. కొత్తగా ఏర్పాటైన పురపాలికల్లో ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా కొన్ని చోట్ల 90 శాతానికి మించి ఓటింగ్ నమోదైంది. యథావిధిగా హైదరాబాద్ శివారు వాసులు ఓటింగ్​కు పెద్దగా ఆసక్తి చూపలేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్ పురాలో కేవలం 27శాతం పోలింగ్ నమోదైంది. కొంపల్లిలో ప్రయోగాత్మకంగా ముఖకవళికలతో ఓటరు గుర్తింపు ప్రక్రియ కూడా సాఫీగానే సాగిందని అధికారులు చెప్తున్నారు.

muncipal-polling-in-telangana
మెుదటి పురపాలక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతం

By

Published : Jan 23, 2020, 12:38 AM IST

రాష్ట్రంలో మొదటి పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కొన్ని చోట్ల క్యూలైన్​లో ఉన్న వారిని ఐదు గంటల తర్వాత కూడా ఓటింగ్​కు అనుమతించారు. అక్కడక్కడా చిన్నపాటి ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం తెలిపింది. చాలా చోట్ల భారీగా పోలింగ్ శాతం నమోదైంది. సాధారణంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పురపోరులోనూ కొన్ని చోట్ల ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన పురపాలికల్లో ఈ పరిణామం స్పష్టంగా కనిపించింది.

చౌటుప్పల్​లో అత్యధికం

ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఓటింగ్ ముగిసేసరికి పోలింగ్ శాతాలు భారీగా నమోదయ్యాయి. చౌటుప్పల్, పోచంపల్లి, చండూరు, ఆదిభట్ల తదితర పురపాలికల్లో పోలింగ్ శాతం ఏకంగా 90శాతాన్ని అధిగమించింది. చౌటుప్పల్​లో అత్యధికంగా 93.31 శాతం పోలింగ్ కాగా... పోచంపల్లిలో 92.51, చండూరులో 91.91, ఆదిభట్లలో 90.27 శాతం ఓటింగ్ జరిగింది. యథావిధిగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే తక్కువ పోలింగ్ నమోదైంది. ఆయా ప్రాంతాల్లో ఓటర్లు ఓటింగ్​పై పెద్దగా ఆసక్తి చూపలేదు. నిజాంపేట, మీర్ పేట, జవహర్ నగర్, జల్ పల్లి, మణికొండ తదితర ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది. నిజాంపేట నగరపాలకసంస్థలో కేవలం 39.65 పోలింగ్ శాతం నమోదైంది.

డబీర్​పురాలో అతితక్కువ

ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డబీర్​పురా డివిజన్​కు జరిగిన ఎన్నికలో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. అక్కడ కేవలం 27.31 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. ఓటర్ల గుర్తింపు కోసం మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి పురపాలికలో ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్​ను ఉపయోగించారు. పది పోలింగ్ కేంద్రాల్లో అమలు చేసిన ఈ విధానం కూడా సాఫీగానే సాగిందని అంటున్నారు. 80 నుంచి 85 శాతం ఓటర్లను యాప్ గుర్తించిందని అధికారులు చెప్తున్నారు. కుటుంబసభ్యుల ఫొటోలు ఒకే విధంగా ఉన్న చోట, పాత ఫోటోలు జాబితాలో ఉన్న చోట మాత్రమే గుర్తింపు ఆలస్యమైందని పేర్కొన్నారు.

25న లెక్కింపు

ఈ నెల 25వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కరీంనగర్​ నగరపాలక సంస్థకు సంబంధించిన ఎన్నికల ప్రచార గడువు ఇవాళ సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. అక్కడ 24వ తేదీన పోలింగ్ జరగనుంది. కరీంనగర్​లో ఈ నెల 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మెుదటి పురపాలక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతం

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం

ABOUT THE AUTHOR

...view details