ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ సభకు సహకరించిన సీనియర్ నేత ప్రేమ్‌సాగర్, నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అదివాసీ, ఎస్సీ సంఘాలకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. ఎలక్షన్ వస్తేనో, ఏదైనా సభ పెడితేనో తప్ప తెరాసకు ప్రజా సమస్యలు గుర్తుకురావని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వస్తే దళిత బంధు గుర్తుకు వచ్చింది. ఇంద్రవెళ్లి సభ పెడితే పోడు భూములు గుర్తుకు వచ్చాయి. కేసీఆర్ అబద్ధలు చెబుతున్నారని అన్నారు.
పోడు భూములకు పట్టాలివ్వాలని, రైతు బంధు ఇవ్వాలని గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. పోడు భూములకు కాంగ్రెస్ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు. రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని సీతక్క కోరారు.