GVL on Special Status: వైకాపా ఎంపీలకన్నా భాజపా పార్లమెంట్ సభ్యులే ఏపీకి ఎక్కువ మేలు చేసే పనులు చేస్తున్నారని.. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలోని అధికార పార్టీకి కేవలం ప్రచార ఆర్భాటం తప్ప.. సమస్యల పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి లేదన్నారు. తెలంగాణతో వివాదం లేని అంశాలను సరి చేయాలనే విభజన కమిటీకి చెప్పామన్న ఆయన.. తెలుగుదేశం నేతలు చెబితే హోదా అంశాన్ని తొలగించారనే ప్రచారాన్ని మానుకోవాలని వైకాపాకు సూచించారు.
"ఏపీలో నిధుల కోసం చట్టసభల్లో నేనే ప్రస్తావించా. వైకాపా ఎంపీలు చేయాల్సిన పని నేనే చేస్తున్నా. కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. మీ కృషి ఎక్కడైనా ఉందా అని వైకాపా ఎంపీలను ప్రశ్నిస్తున్నా. బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేదని అసత్యాలు ప్రచారం చేస్తారా ? ఏమీ చేయకుండానే ప్రాజెక్టులు, రహదారులు వచ్చాయా ? కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ తెచ్చుకోలేదు. సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రానికి హోదా ఇవ్వాలి. ఏపీకి అంతకుమించి ప్యాకేజీ రూపంలో కేంద్రం నిధులు ఇచ్చింది. అన్నీ తెలిసీ జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకి లేఖ రాశా. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సమస్యలపై చర్చించాలి. సూచనలు చేసే కమిటీ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు సంబంధం లేదు. కమిటీలో చేసిన నిర్ణయాలను అమలు చేసేలా చూడాలి. హోదా అంశంలో కేంద్రం, ఏపీ మధ్య చర్చలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక హోదా లేదు.. నిధుల సమీకరణ కోసం కృషి చేయండి. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. నేనేదో మాట్లాడి హోదా అంశం తొలగించారనడం ఆశ్చర్యంగా ఉంది. మోదీ, అమిత్ షా నిర్ణయిస్తే మేము మార్చగలమా ?"