పిల్లల చదువే ఆ తండ్రికి ముఖ్యం. ఎన్ని కష్టాలు పడైనా చదివించాలనుకున్నాడు.
-మరి ఈ కల నెరవేరే అవకాశముందా?
తన తల్లిదండ్రుల కష్టం చూసి ఆ కుర్రాడు చలించిపోయాడు. చదువు ఆపేసి చిరుద్యోగం చేస్తూ వారికి అండగా ఉండసాగాడు.
- ఇప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంది?
వృద్ధాప్యంలోనూ కష్టించడమే ఆయనకు తెలుసు.. భార్యతో కలిసి మూగజీవాలను పోషిస్తూ బతికేవాడు.
- ఇంతకీ వారెలా ఉన్నారు?
రిటైర్‌మెంట్ అనేది వయసుకు కాదని నమ్మే ఆయన.. ఖాళీగా ఉండకుండా మళ్లీ ఉద్యోగం చేస్తున్నాడు.
ఊహించని ఉపద్రవం.. అందని సాయం.. ఆ కుటుంబాల్లో అంధకారం
భారీ వర్షాలు తెలంగాణ ప్రజల జీవితాల్ని తలకిందులు చేశాయి. ఉద్ధృతంగా ముంచుకొంచిన వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సాయంత్రానికల్లా ఇంటికొస్తానని చెప్పి ఉద్యోగాలకు వెళ్లిన కొంత మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయి కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేశారు. ఊహించని ఉపద్రవం ఆ కుటుంబాల్ని రోడ్డున పడేసింది.
-రోజూ విధులకు వెళ్తున్నాడా?
ఊహించని ఉపద్రవంలా వచ్చిన వరద ఈ నలుగురినీ తీసుకెళ్లిపోయింది. కుటుంబాలను రోడ్డున పడేసింది. ప్రభుత్వం సాయం అందక, ఆదుకొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆ పిల్లల భవిష్యత్తు అంధకారం
ఈనెల 13న నల్గొండ జిల్లా చెర్వుగట్టుకు వెళుతూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ వద్ద వరదలో కొట్టుకుపోయి కందుకూరు మండలం బేగంపేటకు చెందిన మాదారం వెంకటేశ్‌గౌడ్ మృతి చెందాడు. ఆయనకు భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలో 8 ఏళ్లుగా డెలివరీమెన్‌గా పనిచేస్తున్నాడు. పిల్లలను బాగా చదివించాలన్నది ఆయన లక్ష్యం. తండ్రి దూరం కావడంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. 60 గజాల్లో కట్టుకున్న సొంతిల్లు తప్ప వారికి మరే ఆస్తి లేదు.
కన్నీట మునిగి..
నాగోలు డివిజన్ బండ్లగూడ చెరువు ముంపు జలాలు విశ్రాంత పోస్టుమ్యాన్ సుందర్‌రాజు(68)ను పొట్టన పెట్టుకున్నాయి. అలానే ఇంట్లో పత్రాలు, నగదు, నిత్యావసరాలు కొట్టుకుపోయి కుటుంబం వీధిన పడింది. చేబదుళ్లతో ఇంటి పెద్ద అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది.
సుందర్‌రాజు పదవీవిరమణ చేసినప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పొరుగు సేవల కింద అదే ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య విజయలక్ష్మి(65), ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కొడుకు ప్రవీణ్ చిరుద్యోగి. చిన్నకొడుకు పవన్ ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. రెండో కొడుకుకు మతిస్థిమితం లేదు. రాజు మృతితో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. వీరి ఇల్లు ఇప్పటికీ వరదలోనే ఉంది.
ఆసరా కోల్పోయి చీకట్లు..
వరద ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో పనిచేస్తున్న ఫణికుమార్(35) ఈనెల 13న విధులు ముగించుకుని బ్రహ్మపురికాలనీలోని ఇంటికొస్తుండగా విద్యుత్తు తీగలు తెగిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇతను.. 12 ఏళ్ల కిందట నగరానికి వచ్చి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. తండ్రికి అనారోగ్యంతో ఏడో తరగతి మధ్యలోనే మానేసి ఇంటి బాధ్యత తీసుకొని కూలీపనులు చేశాడు. కొడుకు మరణించిన శోకంలో ఉండగానే కృష్ణానది వరదల్లో పంటలు నాశనమై అప్పుల పాలయ్యామని అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
చేతికంది చేజారిపోయాడు!
లష్కర్‌గూడ వద్ద జరిగిన ప్రమాదంలోనే వెంకటేశ్‌గౌడ్‌తోపాటు పగడాల రాఘవేందర్ ప్రాణాలు కోల్పోయాడు. నాన్న అంజయ్యతోపాటు అమ్మ కూలీ పనులు చేస్తుండటం చూసి ఇంటర్ అయ్యాక ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తూనే మల్టీమీడియా కోర్సు చేశాడు. నాలుగు నెలలుగా ఓ మల్టీమీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. నెలనెలా అతనికొచ్చే రూ.10-15 వేలతోనే ఇల్లు గడిచేది. తమ్ముడినీ చదివిస్తున్నాడు. రాఘవేందర్ మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆసరా కరవైంది.
కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తూ..
కీసర మండలం రాంపల్లి వద్ద ఎర్రమల్లి వాగులో కొట్టుకుపోతున్న మేక పిల్లను కాపాడబోయి దొబ్బల సత్తయ్య గల్లంతయ్యాడు. ఇంకా ఆచూకీ తెలియలేదు. రూ.5 లక్షల విలువైన 150 గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయి. భర్త కోసం భార్య సుగుణమ్మ, ముగ్గురు కుమారులు కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. వయసు పైబడినా ఎకరంన్నర పొలం కౌలుకు తీసుకొని కుటుంబ పోషణ కోసం సత్తయ్య కష్టపడేవాడని తెలిపారు.