బల్దియా ఎన్నికల్లో పార్టీని, స్థానిక ప్రజలను నమ్ముకుని ఉన్న కార్యకర్తలు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. తెరాసలో కొత్తగా 26 కార్యకర్తలకు అవకాశం లభిస్తే.. 20 మందికి పైగా విజయం సాధించారు.
భాజపా విషయానికి వస్తే.. పార్టీ కార్యకర్తలే కాకుండా, పార్టీ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, ఆరెస్సెస్‌లోని వారూ గెలుపొందారు. ఈసారి పాతవారు నలుగురే పోటీ చేయగా.. ముగ్గురు విజయం సాధించారు. గెలుపొందిన మొత్తం 48 మందిలో ఈ ముగ్గురితోపాటు గతంలో పలుమార్లు పోటీ చేసిన వారు 15 మంది వరకు ఉన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు ఐదుగురున్నారు. ఇక మిగతావారంతా కార్యకర్తలే.
ఎంఐఎంలో కొత్తవారికి 14 మందికి అవకాశం కల్పించారు. ఇందులో 11 మంది విజయం సాధించారు. ఏఎస్‌రావునగర్, ఉప్పల్ డివిజన్లలో విజయం సాధించిన సింగిరెడ్డి శిరీషరెడ్డి, రజితా పరమేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారే.
జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో అధిక సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. గతంలో 99 స్థానాలను గెలుపొందిన తెరాస ఈ సారి ఎన్నికల్లో దాదాపు 44 డివిజన్లు కోల్పోయింది. ఆయా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ బావుటా ఎగరవేసింది. ఆ పార్టీ నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించినా సునాయాసంగా గెలుపొందారు. స్థానిక అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత భాజపాకు బాగా కలిసివచ్చింది. ఇక గెలుపే లక్ష్యంగా తెరాస సిట్టింగ్ కార్పొరేటర్లను పక్కనపెట్టి పలువురికి కొత్తవారికి అవకాశం కల్పించింది. ఇది ఆ పార్టీకి చాలాచోట్ల కలిసొచ్చింది. ఒకటి, రెండుచోట్ల మినహా మిగిలిన డివిజన్లలో సదరు అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు.
* చిలుకానగర్‌లో గోపు సరస్వతి స్థానంలో బన్నాల గీతను బరిలోకి దించగా ఆమె గెలుపొందారు.
* హెచ్‌బీ కాలనీలో గొల్లూరి అంజయ్య స్థానంలో ప్రభుదాస్‌కు టికెట్ కేటాయించగా ఆయన విజయం సాధించారు.
* సోమాజిగూడలో సిట్టింగ్ అభ్యర్థి ఎ.విజయలక్ష్మి స్థానంలో వనం సంగీతా యాదవ్‌ను బరిలోకి దించగా.. ఆమె విజయబావుటా ఎగరేశారు.
* వెంగళరావునగర్ సిట్టింగ్ కార్పొరేటర్ కిలారీ మనోహర్ భాజపా చేరారు. అక్కడ తెరాస దేదీప్యరావుకు అవకాశమివ్వగా.. ఆమె గెలుపొందారు.