ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ తీరుపై మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పించారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతుంటే స్థానిక ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ ఉల్లంఘిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎన్నికల లొల్లి... ఎస్ఈసీపై వైకాపా ఫైర్ సుప్రీంకు వెళ్తాం: మంత్రి పెద్దిరెడ్డి
ఏపీలో ఒక వ్యక్తి ప్రయోజనం కోసం కమిషనర్ రమేశ్ కుమార్ ఏకపక్షం నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి నారాయణస్వామితో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇద్దరి వ్యక్తుల కుట్ర: మంత్రి బొత్స
ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. దేశవ్యాప్తంగా కరోనాతో ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల నెపంతో ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు. ఇళ్ల పట్టాలు, అమ్మఒడి కార్యక్రమాలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఆలయాలపై దాడులు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమే. - మంత్రి బొత్స సత్యనారాయణ
ఎస్‌ఈసీ ఉల్లంఘిస్తున్నారు: ఎంపీ మోపిదేవి
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అనుగుణంగా ప్రభుత్వం నడిచే పరిస్థితులు ప్రస్తుతం లేవని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. కొంతకాలంగా ఎస్‌ఈసీ వైఖరి ఎలా ఉందో తెలుస్తూనే ఉందని విమర్శించారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని ఉల్లంఘిస్తున్నట్టుగా... ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఎలాంటి నిర్ణయమైనా సరే.. ప్రభుత్వంతో సంప్రదింపులు చేశాకే తీసుకుంటే బాగుంటుందని మోపిదేవి చెప్పారు.
నిమ్మగడ్డ రమేశ్... తెలుగు ట్రంప్: ఎమ్మెల్సీ డొక్కా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలతో... అప్రజాస్వామిక విధానాలను పాటిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. గుంటూరులో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా.. ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ట్రంపు మాదిరిగా... నిమ్మగడ్డ రమేశ్ కూడా అదే తరహాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తెలుగు ట్రంప్ అని అభివర్ణించారు.