నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి శరవేగంగా వచ్చేశాయి. శనివారం వనపర్తి, నాగర్‌కర్నూల్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. ఆదివారం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు ఇంత వేగంగా.. జూన్ 5కల్లా తెలంగాణలో ప్రవేశించడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.
గత పదేళ్లలో చూసినా రెండుసార్లు మాత్రమే ఇంతకన్నా ముందు వచ్చాయి. 2013, 2018లో జూన్ 4న తెలంగాణలోకి ప్రవేశించాయి. వాస్తవంగా 14లోగా వస్తాయని వాతావరణశాఖ తొలుత అంచనా వేసింది. కేరళలోకి 3న ప్రవేశించగా రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణను తాకడం గమనార్హం. ఇంత వేగంగా కేరళ నుంచి తెలంగాణకు 2011 నుంచి ఎప్పుడూ రాలేదు. కేరళకు వచ్చిన తరవాత 4 రోజుల నుంచి 14 రోజుల వరకు సమయం పట్టేది.
గత మూడేళ్లుగా రుతుపవనాలు వచ్చిన తేదీలు విస్తారంగా వర్షాలు..
రుతుపవనాల రాకకు సంకేతంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా జుక్కల్ (కామారెడ్డి జిల్లా)లో 12, పోచంపల్లి(యాదాద్రి)లో 9, పిట్లం(కామారెడ్డి)లో 8, భీంగల్(నిజామాబాద్)లో 7, నారాయణఖేడ్(సంగారెడ్డి)లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇంకా పలు ప్రాంతాల్లో ఇంతకన్నా తక్కువగా వర్షం పడింది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 6.7 డిగ్రీల వరకు తక్కువగా ఉంది.
శుక్రవారం రాత్రి మెదక్‌లో 19.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రుతుపవనాలు వచ్చినందున వర్షాలు కొనసాగుతాయని ఉరుములు, మెరుపులతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సంస్థ మాత్రం జుక్కల్‌లో 5.2 సె.మీ, పోచంపల్లిలో 8.4, పిట్లంలో 4.3, భీంగల్‌లో 5.6, నారాయణఖేడ్‌లో 7.25 సె.మీ.ల వర్షపాతం నమోదయిందని ప్రకటించడం గమనార్హం.
ఇవీచూడండి:WEATHER REPORT: హైదరాబాద్‌లో రాత్రి నుంచి భారీవర్షం