నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. ఉప్పల్, ఎల్‌బీనగర్, బేగంపేట్, వనస్థలిపురం, సికింద్రాబాద్, బోయిన్పల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో రహదారులన్నీ జలమయమయ్యాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం లింగోజీగూడలో అత్యధికంగా 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రేపటివరకల్లా..
భువనగిరి జిల్లాలో ఏకధాటిగా వర్షం కురిసింది. పట్టణంలోని పెద్ద చెరువులోకి నీరు వస్తుండటం పట్ల పట్టణ ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గార్ల, బయ్యారం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బయ్యారం పెద్ద చెరువులోకి తొమ్మిది అడుగులకు నీరు చేరుకుంది. రేపటివరకల్లా మిగతా జిల్లాల్లో నైరుతి రుతపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.