KCR Fire on Modi: దేశంలో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ పదేపదే బలంగా చెప్తూ వస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవసాయం అంశంగా మరోమారు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉండటం భారత రైతుల దురదృష్టమన్న ఆయన... దేశంలో వ్యవసాయరంగాన్ని బలహీన పర్చే అంతర్గత కుట్రకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణ రైతులు, రాష్ట్రాన్ని అవమాననపరుస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఎంత గర్వం, ఎంత అహంకారమని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం సాధించలేని లక్ష్యాలను తెలంగాణ సాధిస్తోంటే జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
ఆహార భద్రత చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. దిల్లీ వేదికగా భారత ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసి దోషిగా నిలబెట్టినట్లు తెలిపారు. ఆర్థిక నేరగాళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతున్నారని... మాల్యా, నీరవ్ మోదీని అరెస్టు చేసేందుకు వెళ్లిన అధికారులను వెనక్కి రప్పించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. త్వరలోనే దేశం ముందు వారి బండారాన్ని బయటపెడతామని ప్రకటించారు. రైతులకు మాఫీ చేయద్దన్న భాజపా నేతలు కార్పొరేట్ సంస్థలకు రూ.10.50లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని అన్నారు. ఒక్క అదానీ గ్రూపునకే రూ.12వేల కోట్లు మాఫీ చేశారని చెప్పారు. రైతులకు రూ.1500కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వానికి చేతులురావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలమైన దేశం, బలహీన రాష్ట్రాలు అన్నది భాజపా, ఆరెస్సెస్ విధానమని కేసీఆర్ అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పాలన చేతకాక... అనాలోచిత నిర్ణయాలతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. దేశంలో జీడీపీ తగ్గిందని, నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు.