ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే ఎస్సీల ఆత్మగౌరవం గుర్తుకువస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎస్సీల మనోభావాలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని విమర్శించారు. ఎస్సీని సీఎం చేస్తానన్న కేసీఆర్... మాట తప్పాడని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు విశ్వసనీయత ఎక్కడా కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఎస్సీలకు అన్యాయం చేస్తూ... దళిత బంధు పేరుతో మాయ చేస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ఏడాది కూడా ఎస్సీలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు అడిగే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. మరో ఎస్సీ నేత అరూరి రమేశ్‌కు పదవి ఎందుకివ్వలేదని నిలదీశారు.
30 లక్షలకు 10 లక్షలే ఇస్తూ మోసం..
"దళితున్ని సీఎం చేస్తా అని మాట ఇచ్చి.. కేసీఆరే ఆ కుర్చీపై కూర్చున్నారు. మొదటి పర్యాయంలో దళితునికి డిప్యూటీ సీఎం ఇచ్చిన కేసీఆర్... రెండో ప్రభుత్వంలో అది కూడా ఇవ్వలేదు. 15 శాతం రిజర్వేషన్లో భాగంగా ఎస్సీలకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలి. ఈ 15 శాతం రిజర్వేషన్లలో ముగ్గురు మంత్రులను చేయాల్సిన కేసీఆర్.. ఒక్కరికే అవకాశం కల్పించారు. దళితుల భావాలను కేసీఆర్ కించపర్చుతున్నారు. కేసీఆర్ పాలనలో దళితులపై ప్రేమ ఉన్నట్లు విశ్వసనీయత కనపడటం లేదు. మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఏకరానికి 10 లక్షలు అయినా 30 లక్షలు ఇవ్వాలి.. కానీ 10 లక్షలకే పరిమితం చేస్తూ మోసం చేస్తున్నారు. తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ చెప్పింది. ఉద్యోగాల భర్తీ చేయకుండా దళితులకు అన్యాయం చేస్తూ... ఇప్పుడు దళిత బంధు అమలు చేస్తున్నారు. ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ఏడాది కూడా దళితులకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయలేదు. 35 వేల కోట్లు కేసీఆర్ ఖాజానాలో పెట్టుకొని ఎస్సీలను మోసం చేస్తున్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీలకు 35 వేల ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు." - జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ