రాష్ట్రంలో చేపల ధరలు నియంత్రణలో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయం సమావేశ మందిరంలో మత్య్సశాఖపై మంత్రి సమీక్షించారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో లాక్డౌన్ సమయంలోనూ సమృద్ధిగా చేపలు లభ్యమతున్నాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమం, నీటి వనరులు పెద్ద ఎత్తున పెరగడం ఫలితంగా మత్స్య సంపద కూడా పెరిగిందని మంత్రి వివరించారు. మత్స్యకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. మత్స్యకారులంతా సొసైటీల్లో సభ్యత్వం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
33 జిల్లాల వారీగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం పాలకవర్గం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. కొన్నేళ్లుగా పలు సంఘాల్లో కొందరే పెత్తనం సాగిస్తున్నారని.. ఇకపై అలాంటివి సహించేది లేదన్నారు.
ముషీరాబాద్ టోకు చేపల మార్కెట్ వారంలో మూడు రోజులపాటు పని చేస్తుందని... 80 నుంచి 90 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. టోకు చేపల మార్కెట్ సౌకర్యవంతంగా లేదని, విశాలమైన మరో ప్రాంతానికి తరలించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు తలసాని సూచించారు. మత్స్య సమాఖ్య లేదా ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో మార్కెట్ నిర్వహించుకునేందుకు గల అవకాశాలు పరిశీలించాలన్నారు. సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు. దశల వారీగా జిల్లాల్లో చేపల విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వం గుర్తించిన స్థలంలో ఫెడరేషన్ ద్వారా కొర్రమీను రకాలు జిల్లాల నుంచి సమకూర్చుకొని ముషీరాబాద్ సహా ఇతర చేపల మార్కెట్లకు సరఫరా చేసే స్థాయికి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఇవీచూడండి:వైద్య సిబ్బందిపై కేటీఆర్ ప్రశంసల జల్లు